Begin typing your search above and press return to search.

వాళ్లకు సెలవులు రద్దు చేసిన కేసీఆర్.. కారణమిదే..

By:  Tupaki Desk   |   6 Jan 2022 9:43 AM GMT
వాళ్లకు సెలవులు రద్దు చేసిన కేసీఆర్.. కారణమిదే..
X
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు వారాల పాటు ప్రభుత్వ డాక్టర్లు, నర్సుల సెలవులను రద్దు చేసింది.


తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా ఒక్కరోజులోనే 1500కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు చెప్పినట్టుగా థర్డ్ వేవ్ మొదలైందా? అనే భయాందోళనలు కలుగుతున్నాయి. థర్డ్ వేవ్ కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సిద్ధం చేయాలంటూ ఆస్పత్రుల సూపరిటెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో మంగళవారం వెయ్యి కేసులు నమోదు కాగా.. బుధవారం 1520 కరోనా కేసులు వెలుగుచూశాయి. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేసులు పెరిగిన సమయంలో ఆస్పత్రులకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం డాక్టర్లు, నర్సుల సెలవులు రద్దు చేసింది.

మరోవైపు వ్యాక్సిన్ సర్టిఫికెట్లు ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాల్లోకి రానివ్వాలంటూ త్వరలో ఆదేశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను త్వరగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 8 నుంచి సెలవులు కావడంతో స్కూళ్లలోనే వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కొద్దిరోజులుగా పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్రల్లో కర్ఫ్యూలు, నిబంధనలు, బంద్ లు పెట్టారు. తాజాగా తెలంగాణలో రాష్ట్రంలో న్యూ ఇయర్ ఎఫెక్ట్ భారీగానే పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా 1500పైగా రోజువారీ కరోనా కేసులు నమోదు కావడం సంచలనమైంది. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరించినట్టే కేసులు పెరుగుతున్నాయి. రానున్న రెండు వారాలు చాలా జాగ్రత్తలు పాటించాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో అధికారులు చెప్పినట్టు తెలంగాణలో థర్డ్ వేవ్ సంకేతాలు ఏర్పడ్డాయి.

ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 63 శాతం కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీగా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో న్యూఇయర్ కు ముందు గత నెల 29న 3490 కేసులు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 4858కి పెరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 42991 నమూనాలను పరీక్షించారు.

ఇక తెలంగాణలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మహబూబాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లోని గురుకులాల్లో తాజాగా కరోనా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సోకింది. దీంతో తెలంగాణలో థర్డ్ వేవ్ మొదలైనట్టేనన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.