Begin typing your search above and press return to search.

మోడీ వెన‌క్కి త‌గ్గాల్సిందే అంటున్న కేసీఆర్‌!!

By:  Tupaki Desk   |   7 Aug 2017 5:11 AM GMT
మోడీ వెన‌క్కి త‌గ్గాల్సిందే అంటున్న కేసీఆర్‌!!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఒక అల‌వాటు ఉంది. ఆయ‌న దేని మీదైనా దృష్టి పెడితే.. ఇక దాని మీద‌నే త‌న ఫోక‌స్ అంతా చేస్తారు. ఇప్పుడు ఆయ‌న మ‌దిలో మోడీ తీరు మీద అసంతృప్తి ఉంది. అందునా తెలంగాణ రాష్ట్రానికి రూ.19వేల కోట్లు ప్ర‌యోజ‌నం క‌లిగించే అంశం కావ‌టంతో పాటు.. జాతీయ స్థాయిలో మోడీ మీద ఒత్తిడి తెచ్చి ఆయ‌న్ను వెన‌క్కి త‌గ్గేలా చేసిన మొన‌గాడ‌న్న ఇమేజ్‌ ను సొంతం చేసుకోవాల‌న్న త‌ప‌న కేసీఆర్ లో క‌నిపిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

ప్రాజెక్టుల‌కు 12 శాతం జీఎస్టీని విధిస్తూ మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై తెలంగాణ సీఎం మొద‌టి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఇదే విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు. అందుకే.. ఇప్పుడు ఆయ‌న త‌న తీరును మార్చారు. జీఎస్టీ విష‌యంపై ఆయ‌న త‌ర‌చూ మాట్లాడ‌ట‌మే కాదు.. అధికారుల‌తో రివ్యూ స‌మావేశాన్ని నిర్వ‌హించి.. మ‌రోసారి ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు.

కేంద్రం జీఎస్టీ మీద దృష్టి సారించాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ప్రాజెక్టుల విష‌యంలో అమ‌ల‌వుతున్న జీఎస్టీ విధానం ఏమాత్రం స‌రైంది కాద‌ని.. ఇది పూర్తిగా అస‌మంజ‌స‌మ‌ని వాదిస్తున్నారు. 5 శాతం వ్యాట్ అంచ‌నాల‌తో మొద‌లైన ప్రాజెక్టుల త‌యారీ.. కేటాయింపులు జ‌రిగిపోయిన వేళ‌.. ఇప్పుడు 12 శాతం జీఎస్టీ విధిస్తే.. ఏం కావాల‌ని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు.

ప్రాజెక్టుల‌కు అమ‌లు చేస్తున్న 12 శాతం జీఎస్టీ కార‌ణంగా జ‌రిగే న‌ష్టాన్ని ప్ర‌ధాని దృష్టికి లేఖ రూపంలో తీసుకెళ్లాల‌ని ఆదివారం కేసీఆర్ అనుకున్నారు. అయితే.. మిష‌న్ భ‌గీర‌థ‌.. గృహ నిర్మాణం.. విద్యుత్ ప్రాజెక్టులు.. ర‌హ‌దారుల నిర్మాణం త‌దిత‌ర ప్రాజెక్టుల‌కు సంబంధించిన గ‌ణాంకాలు అందుబాటులోకి రాక‌పోవ‌టంతో లేఖ రాసే కార్య‌క్ర‌మానికి సోమ‌వారానికి వాయిదా వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రితో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు.. అన్ని రాష్ట్రాల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని.. భారీగా భారం ప‌డుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల్లో దేని మీదా ఇంత క‌చ్ఛితంగా లేని కేసీఆర్‌.. ఈసారి మాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. జీఎస్టీ విష‌యంలో కేంద్రం త‌న తీరును మార్చుకోవాల‌ని.. మోడీ ఈ ఇష్యూలో త‌గ్గాల్సిందేన‌ని తేల్చి చెబుతున్నారు. కేసీఆర్ అంత క‌చ్ఛితంగా ఉన్న ఈ అంశంపై ప్ర‌ధాని మోడీ ఏ తీరులో రియాక్ట్ అవుతారో చూడాలి.