Begin typing your search above and press return to search.

చండీయాగం తొలిరోజు హైలెట్స్..

By:  Tupaki Desk   |   24 Dec 2015 4:56 AM GMT
చండీయాగం తొలిరోజు హైలెట్స్..
X
ఐదు రోజుల పాటు నభూతో నభవిష్యతి అన్న తీరులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి సంబంధించి తొలిరోజు విజయవంతంగా పూర్తి అయ్యింది. అనుకున్న దాని కంటే మిన్నగా ఎలాంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా సాగిపోయింది. 50వేల మంది ప్రజలు.. వందల్లో వచ్చిన వీవీఐపీలు.. 2000కు పైగా రుత్వికులతో సాగిన చండీయాగం తొలిరోజు హైలెట్స్ ను చూస్తే..

1. యాగాన్ని చూసేందుకు ఉదయం 7 గంటల నుంచే జన సందోహం మొదలైంది. మధ్యాహ్నానానికి 50వేల మంది వరకూ వచ్చినట్లు అంచనా. యాగ మండపాల్ని సందర్శించుకోవటానికి.. యాగాన్ని చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాగ కార్యక్రమం అందరికి స్పష్టంగా కనిపించేందుకు వీలుగా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ తెరల్ని ఏర్పాటు చేశారు.

2. ఓపక్క చండీయాగం సాగుతుంటే.. మరోవైపు కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. పంక్తికి 1500 మంది చొప్పున నాలుగు పంక్తుల్లో 6వేల మంది కుంకుమార్చనలో పాల్గొన్నారు. సామాన్యులతోపాటు గవర్నర్ సతీమణి విమల.. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ.. కుమార్తె కవిత తదితర ప్రముఖులు కుంకుమార్చలో పాల్గొన్నారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలందరికి చీరలు పంచారు.

3. భారీగా సాగుతున్న యాగానికి అవసరమైన రుత్విజులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కనిపించారు. తెలంగాణ నుంచి 700 మంది.. ఏపీ నుంచి 50 మంది.. ఉత్తరప్రదేశ్ నుంచి 150.. మహారాష్ట్ర నుంచి 250.. కర్ణాటక నుంచి 400 మంది రుత్విజులు పాల్గొన్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వీరంతా ఒకరిని ఒకరు పలుకరించుకోవటం.. మాట్లాడుకోవటం కనిపించింది. ఒకవైపు పూజలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు భక్తులను ఆశ్వీరదించారు. ఖాళీ సమయాల్లో ఫోటోలు.. సెల్పీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ కనిపించారు.

4. అయుత చండీయాగం నిర్వహిస్తున్న చోట దాదాపు 1500 మందికి పైగా రుత్విజులు పూజలు చేస్తున్న చోట..ప్రతి రుత్విజుడి పక్కన గులాబీ సంచి ఆకర్షణీయంగా కనిపించింది. ఇంతకీ ఆ గులాబీ సంచి ఏమిటంటే.. రుత్విజులకు అవసరమైన సమగ్ర సామాగ్రిని దాన్లో ఉంచి ప్రతిఒక్కరికి ఒక్కొక్కటి చొప్పున పంచారు. సంచి పైభాగాన చండీయాగం గుర్తును ముద్రించారు. ఇక.. సంచిలో.. పంచపాత్రలు.. ఆసనం..విబూది.. గంధం.. రుద్రాక్ష మాట.. ధోవతి.. ఉత్తరీయంతో పాటు కొబ్బరినూనె.. పేస్టు.. బ్రష్.. సబ్బులు.. రాత్రివేళ నిద్రించటానికి వీలుగా చాప.. దిండు లాంటి ఎన్నో వస్తువులున్నకిట్ అందించారు. రుత్విజులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మంచినీళ్ల బాటిల్స్ ను ఎప్పటికప్పుడు అందించటం కనిపించింది.

5. యాగశాలకు దీక్షా వస్త్రాలతో రావొచ్చన్న మాటతో రాజకీయ నాయకులు.. సీనియర్ అకారులంతా రుత్విజులను తలపించేలా పచ్చని దీక్షా వస్త్రాలు ధరించి వచ్చారు.

6. ముత్తయిదువులకు చీరల పంపిణీ కోసం ఎంపీ కవిత దాదాపు రెండు గంటల పాటు ఓపిగ్గా పంచారు.

7. అత్యంత ప్రముఖులకు తప్పించి.. మిగిలిన అందరిని ఒకే తీరులో దర్శనం ఏర్పాట్లు చేయటంతో ఎలాంటి ఇబ్బంది.. విమర్శలు చోటు చేసుకోలేదు.

8. ప్రతిఒక్కరిని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే యాగశాలలోకి అనుమతిస్తున్నారు.

9. భారీ ఏర్పాట్లు చేయటంతో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం కుంభమేళాను తలపించినట్లుగా పలువురు వ్యాఖ్యానించుకోవటం కనిపించింది.

10. సప్తశతీ పారాయణం జరుగుతున్నంత సేపు.. దాదాపు నాలుగు గంటలకు పైనే ముఖ్యమంత్రి కేసీఆర్ కదలకుండా కూర్చున్నారు.

11. రాత్రివేళ ఎర్రవెల్లి విద్యుత్తు కాంతులతో మెరిసిపోయింది.

12. రుత్విజులు నిద్రించేందుకు వీలుగా.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విశాలమైన షెడ్లను సౌకర్యవంతంగా రూపొందించటం గమనార్హం.

13. నేలపై కూర్చోపెట్టి భోజనం వడ్డించారు. 50వేల మందికి భోజనం కోసం కరీంనగర్ జిల్లా మాంథని నుంచి 350 మంది వంటవాళ్లను రప్పించారు. గురువారం నుంచి మరో 150 మంది రానున్నట్లు చెబుతున్నారు.

14. ముఖ్యమంత్రి మొదలు.. ఆయన భద్రతాసిబ్బంది.. ఫోటోగ్రాఫర్లు.. కెమేరామెన్లు.. నేతలు అంతా పసుపుపచ్చని దీక్షా వస్త్రాలే ధరించటం విశేషం (హరీశ్.. కేటీఆర్.. మరికొందరు ప్రముఖులు తప్ప)