Begin typing your search above and press return to search.

ఎలాంటి కేసీఆర్ ఎలా అయిపోయారు!

By:  Tupaki Desk   |   17 Sep 2019 2:30 PM GMT
ఎలాంటి కేసీఆర్ ఎలా అయిపోయారు!
X
వచ్చే పది సంవత్సరాలూ తానే తెలంగాణకు సీఎంగా ఉంటానని.. తన ఆరోగ్యం భేషుగ్గా ఉందని ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. కేసీఆర్ ఎందుకిలా ప్రత్యేకంగా - పనిగట్టుకుని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించుకోవాల్సి వస్తోంది.. ఇదే కాదు - పలు ఇతర విషయాల్లోనూ ఆయన వివరణలు, సంజాయిషీలు ఇచ్చుకునేలా మాట్లాడుతుండడం ఆయనలో ఆత్మవిశ్వాసం తగ్గిందనడానికి - ఆయన డిఫెన్సులో ఉన్నారనడానికి నిదర్శనమని విశ్లేషణలు వస్తున్నాయి. ఆధిపత్య మనస్తత్వమున్న నాయకుల్లో ఆత్మవిశ్వాసం తగ్గినా - డిఫెన్సులో పడినా వారి రాజకీయ జీవితం ముగిసినట్లేనని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలున్నాయి. పులిలాంటి నాయకుల మనసుల్లో పిల్లి దూరితే వారి పని అయిపోయినట్లేనని ఎందరి విషయంలోనో రుజువైంది. ఇప్పుడు కేసీఆర్‌ లోనూ పిల్లి దూరిందని అంటున్నారు.

లోటు బడ్జెట్‌ పై సంజాయిషీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైంది మొదలు సీఎం కేసీఆర్ తీరును నిశితంగా పరిశీలించినవారికి ఒక విషయం అర్థమవుతుంది. ఆయనలో మునుపటి పదును పోయింది. అసెంబ్లీలో తానే స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు భారీగా తగ్గడానికి గల కారణాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణలో ఆయన నెపాన్నికేంద్రపై నెట్టారు. ఇది రాజకీయ ఎత్తుగడే అయినప్పటికీ అందుకు కారణాలను ప్రజలకు అంత వివరంగా చెప్పడమనేది కేసీఆర్ గతంలో ఎన్నడూ చేయని పని.

విమోచన దినంపై వివరణ

తెలంగాణ విమోచన దినంపై కూడా కేసీఆర్ వివరణ ఇచ్చుకున్నారు. బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో హడావుడి చేస్తుండడంతో ఆ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న భయం కేసీఆర్‌ లో ఉంది.. అలా అని - మజ్లిస్‌ ను కాదని విమోచన దినాన్ని తామూ నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో ఒకప్పుడు విమోచన దినం జరపాలని తానూ డిమాండ్ చేశానని ప్రజలకు గుర్తు చేస్తూ ఇప్పుడెందుకు చేయడం లేదో కేసీఆర్ వివరణ ఇచ్చుకున్నారు. దురుసు మాటలతో అడ్డంగా ప్రత్యర్థులపై పడి నోళ్లు మూయించడమే తెలిసిన కేసీఆర్ ఇలా వివరణ ఇచ్చుకోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

సెప్టెంబర్‌ 17న తమ పార్టీ తెరాస తెలంగాణ భవన్‌ పై మొదటి నుంచి జాతీయ జెండాను ఎగురవేస్తోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌ 17న ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం అణచి వేయదని - ఎవరూ ఏం చేయదలుచుకుంటే అది చేసుకోవచ్చని చెబుతూ తామేమీ అణచివేయడం లేదంటూ ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు. సెప్టెంబరు 17 అంటే ఆటోక్రసీ నుంచి డెమొక్రసీకి బదిలీ జరిగిన రోజంటూ విమోచన దిన ప్రాధాన్యాన్ని కూడా అంగీకరించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కూడా విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాని గురించి సమగ్రంగా పరిశీలన జరిపామని దానిలో ఉన్న సంక్లిష్టతను మేధావులు - కవులు - కళాకారులు గుర్తించి విమోచన దినాన్ని నిర్వహిస్తే పాత గాయాలను ప్రేరేపించినట్టు అవుతుందన్న విషయాన్ని వారు చెప్పారని అంటూ విమోచన దినాన్ని ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు.. నిర్వహించకపోవడానికి కారణం మేధావులు - కవులు - కళాకారులేనని వారిపై నెపం నెట్టేశారు.

పనైపోయిందన్న ప్రచారంపై వివరణ

బీజేపీ తెలంగాణలో పుంజుకుంటోంది.. కేసీఆర్‌ పై టీఆరెస్‌ లో తీవ్ర అసమ్మతి ఉందన్న ప్రచారాలు కేసీఆర్‌‌ కు బలంగానే తాకినట్లు అర్థమవుతోంది. మామూలుగా అయితే, అలాంటి వాటిని ఆయన డోన్ట్ కేర్ అంటారు. కానీ, ఇప్పుడు మాత్రం తన ఆరోగ్యం బాగుందని.. మరో రెండు టెర్ములు గ్యారంటీగా సీఎం అవుతానని.. టీఆరెస్ కూడా మరో మూడు టెర్ములు గెలుస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇదంతా తెచ్చిపెట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడమే. అంతకుముందు ఇలాంటివి ఆయన పట్టించుకునేవారు కాదు.. ఇలాంటి ప్రచారాలు - విమర్శలపై మాట్లాడినా అవి ప్రచారమవడానికి కారణమైనవారిని.. ప్రచారంలోకి తెచ్చినవారిని ఏకిపడేస్తూ వారి ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టేవారు. కానీ, ఇప్పుడు తన తరఫున చెప్పాల్సినవి చెప్పుకొంటున్నారు.