Begin typing your search above and press return to search.

ల‌క్ష‌కు త‌గ్గేది లేదంటున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   12 March 2017 10:19 AM GMT
ల‌క్ష‌కు త‌గ్గేది లేదంటున్న కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు త‌న మాట అంటే మాటేన‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము ఇచ్చిన ల‌క్ష ఉద్యోగాల హామీని నిల‌బెట్టుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. 2019లోపే లక్ష ఉద్యోగాలు కచ్చితంగా కల్పించి తీరుతామని స్పష్టంచేశారు. 2017-18 బడ్జెట్‌ లోనే 50వేల ఉద్యోగులను కొత్తగా తీసుకుంటే వేతనాలు ఇచ్చేలా వెసులుబాటు పెట్టుకున్నామని ఆయ‌న ప్ర‌క‌టించారు.ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు.ఈ సంద‌ర్భంగా 'నిరుద్యోగ యువతకు మీ అన్నగా చెప్తున్నా. తెలంగాణ సాధించింది నా ఒక్కని కోసం కాదు. మీ భవిష్యత్ కోసమే సాధించుకున్నాం. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కచ్చితంగా రాబోతున్నాయి' అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై గవర్నర్ చేసిన ప్రసంగంలో అబద్ధాలు, అతిశయోక్తులు ఉన్నట్టు ప్రతిపక్షాలు నిరూపిస్తే ఐదు నిమిషాల్లోనే రాజీనామా చేసి ఇంటికి వెళతానని సీఎం సవాల్ విసిరారు.

ఈ సంద‌ర్భంగా విప‌క్షాల తీరుపై కేసీఆర్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. "ఉద్యోగాల విషయం మీద కాంగ్రెస్ - బీజేపీ - టీడీపీ - ఎర్రజెండాల పార్టీలు రచ్చ చేస్తున్నాయి. ఎందుకు మీరు యువకుల్లో ఈ అశాంతిని నింపుతున్నారు? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో కోటీ 3 లక్షల కుటుంబాలు ఉన్నట్టు లెక్క ఉంది. మరి 60 ఏళ్ల‌ పరిపాలనలో గత ప్రభుత్వాలు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాయి? నిరుద్యోగ యువతకు నాది ఒకటే విజ్ఞప్తి.. కొందరు రాజకీయ నిరుద్యోగులు వారి అవసరాలకోసం మీ భుజంపై తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నారు. మీరు మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. 2019వరకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీరుతాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా 50వేల ఉద్యోగాలు కల్పిస్తే వేతనాలు ఇచ్చేందుకు బడ్జెట్‌లో వెసులుబాటు పెట్టుకున్నాం" అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. చిన్న ఉద్యోగుల‌కు సైతం మేలు చేసేలా త‌మ ప్ర‌భుత్వం సాగుతున్న‌ద‌ని కేసీఆర్ తెలిపారు. "హోంగార్డులకు గతంలో రూ.6వేల వేతనం ఇచ్చారు. ఆ తరువాత రూ.8వేలు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని రూ.12వేలు చేశాం. ఇది సరిపోదు. హోంగార్డులను కూడా వందశాతం రెగ్యులరైజ్ చేయబోతున్నాం. రెగ్యులర్ కానిస్టేబుల్ మాదిరిగా వారికి వేతనాలు ఇవ్వబోతున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటన చేస్తాం. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను కాంగ్రెస్-టీడీపీ ప్రభుత్వాలు రద్దు చేశాయి. మేము పునరుద్ధరించాం. కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామంటే కాంగ్రెస్ అనుబంధం సంఘం కోర్టుకు పోయి స్టే తెస్తది. అమ్మ పెట్టది... అడక్క తీననివ్వదు అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరు"అంటూ నిప్పులు చెరిగారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఇష్ట‌మైన నీటి పారుద‌ల ప్రాజెక్టుల విష‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ అడ్డుప‌డ‌టంపై కేసీఆర్ మండిప‌డ్డారు. "రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే అడుగుడుగునా అడ్డుకుంటున్నారు.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారే కేసులు పెడుతున్నారు. రైతుల మీద ప్రేమ ఉండే చేస్తున్నరా? మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్టమొదటి సారిగా 4.50లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. 1000 చెరువులు నీళ్లు నింపుకొన్నరు. రివర్స్ మైగ్రేషన్ వస్తున్నారు. ఏడు నియోజకవర్గాలు కళలాడుతున్నాయి. వారి హయాంలో 80 శాతం ప్రాజెక్టులు కట్టామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ పాయే నీళ్లు? కల్వకుర్తిని పండ పెట్టి... భీమా ఎండ పెట్టి, నెట్టంపాడు నిర్రనిలబెట్టారు. హంద్రీనీవాకు రఘువీరారెడ్డి నీళ్లు తీసుకపోతుంటే ఇదే మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులైన డీకే అరుణ మంగళహారతి ఇచ్చారు. మీ మౌనం వల్ల, చేతగాని తనంవల్ల తెలంగాణకు నష్టం జరిగింది. కోర్టుల స్టేలు స్పీడ్ బ్రేకర్ లాంటివి.. వేగాన్ని తగిస్తాయి కానీ.. మొత్తం ప్రాజెక్టును ఆపలేవు. ఆరు నూరైనా సరే... ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతాం. రెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టి తీరుతాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి 21 జిల్లాలు ఏర్పాటు చేయరు.. దఫాలుగా ఏర్పాటు చేసి ఉంటారు. మన రాష్ట్రంలో ఒకేసారి 21 జిల్లాలు ఏర్పాటుచేశాం. ప్రజలకు పరిపాలన చేరువచేయాలని చేపట్టిన సంస్కరణలకు అద్భుతమైన బ్రహ్మాండమైన అదరణ లభిస్తున్నది. ప్రజల అశీస్సులు లభిస్తున్నాయి." అంటూ త‌న‌దైన శైలిలో వివ‌ర‌ణ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/