Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోటి వెంట కరోనా పాజిటివ్ కేసు మాట

By:  Tupaki Desk   |   14 March 2020 8:45 AM GMT
కేసీఆర్ నోటి వెంట కరోనా పాజిటివ్ కేసు మాట
X
కరోనా పాజిటివ్ కేసును విజయవంతంగా చికిత్స చేసి.. అతడ్ని డిశ్చార్జ్ చేసిన వైనం తెలిసిందే. శుక్రవారం రాత్రి వేళలో సదరు వ్యక్తిని ఇంటికి పంపిన తర్వాత తెలంగాణలో మరెలాంటి కేసు లేదన్న మాట పలువురి నోట వినిపించింది. అయితే.. ఆ మాటలో నిజం లేదన్న విషయాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ రోజు(శనివారం) అసెంబ్లీలో ఆయన కరోనాకు సంబంధించిన కీలక అప్డేట్ ను వెల్లడించారు.

కరోనాపై ఎప్పటికప్పుడు తాను సమీక్షిస్తున్నట్లు చెప్పిన కేసీఆర్.. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ 65 మందికి సోకగా.. అందులో పది మంది కోలుకున్నారని.. ఇద్దరు మరణించారన్నారు. తాజాగా ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న కేసీఆర్.. సదరు వ్యక్తి గాంధీలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

అంతేకాదు.. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న మరో ఇద్దరు నమూనాల్ని పూణె పరీక్షా కేంద్రానికి పంపినట్లుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్న ఆయన.. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో సినిమా హాళ్లు.. పాఠశాలలు బంద్ చేశారన్నారు. మహారాష్ట్ర.. ఒడిశాలలోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. బెంగళూరులో అయితే మాల్స్ కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటని.. శంషాబాద్ ఎయిర్ పోర్టు లో రద్దీ బాగా పెరిగినట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రోలో రోజుకు నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. కరోనా విషయం లో పొరుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? మనమేం చేయాలన్న విషయంపై ఈ రోజు (శనివారం) సాయంత్రం ఆరు గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశం లో చర్చిస్తామని.. ఆ వివరాల్ని తర్వాత ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించటం గమనార్హం.