Begin typing your search above and press return to search.

జానా ఇంటికి వెళ్తానంటున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   27 Dec 2016 6:00 PM GMT
జానా ఇంటికి వెళ్తానంటున్న కేసీఆర్‌
X
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌పై చ‌ర్చ జరుగుతున్న సంద‌ర్భంలో ఒక్క‌సారిగా స‌భ‌లో న‌వ్వులు విరిశాయి. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌పై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన త‌ర్వాత ఆయ‌న కూర్చున్నారు. వెంట‌నే ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డి ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. సీఎం భోజ‌నం చేసి వ‌చ్చిన‌ట్లున్నారు అన‌గానే స‌భ‌లో న‌వ్వులు పూశాయి. ఆ త‌ర్వాతే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఒక‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నేత ఇంటికి ముఖ్య‌మంత్రి వెళ్లి భోజ‌నం చేసే సాంప్ర‌దాయం ఉండేద‌ని ఆయ‌న గుర్తు చేశారు. త‌ను సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత జానారెడ్డి ఇంటికి భోజ‌నానికి వెళ్దామ‌ని ఓ సారి అనుకున్నాను కానీ అప్పుడు ఉపఎన్నిక రావ‌డంతో లేనిపోని మాట‌లు వ‌స్తాయ‌ని భావించి ఆలోచ‌న‌ను విర‌మించుకున్న‌ట్లు కేసీఆర్ చెప్పారు.

అయితే కేసీఆర్ ఇంత‌టితో ఆపేయ‌లేదు. త్వ‌ర‌లో ఖ‌చ్చితంగా జానారెడ్డి ఇంటికి భోజ‌నానికి వెళ‌తాన‌ని స‌భావేదిక‌గా ప్ర‌క‌టించారు. ప‌ప్పు పెట్టినా, పులుసు పెట్టినా స్వీక‌రించి సంతోషంగా భోజ‌నం చేసి వ‌స్తాన‌ని కేసీఆర్ చెప్పిన‌ప్పుడు స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారితో స‌హా స‌భ మొత్తం న‌వ్వుల్లో మునిగింది. ఈ స‌మ‌యంలో జానారెడ్డి మాట్లాడుతూ ప్ర‌భుత్వ గృహ‌నిర్మాణ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు పాత రుణాలు మాఫీ చేయాల‌ని తాము కోరాల‌ని భావించామ‌ని అయితే సీఎం మాఫీ చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల త‌ర‌ఫున తాను అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/