Begin typing your search above and press return to search.

జానారెడ్డిని తప్పుపట్టడం సబబేనా?

By:  Tupaki Desk   |   19 Nov 2015 10:30 PM GMT
జానారెడ్డిని తప్పుపట్టడం సబబేనా?
X
మాజీ మంత్రి జానారెడ్డి మంత్రి పదవి కోసం తెలంగాణను అడ్డు పెట్టుకున్నాడని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోపించారు. అందుకు నా త్యాగాన్నే తప్పుపడతావా? అని జానారెడ్డి మండిపడ్డారు. ఈ రెండూ రాజకీయ విమర్శలేనని అనుకున్నా.. వాటిలోని లోతుపాతుల్లోకి వెళితే ఎవరి వాదన నిజమో కూడా తెలుసుకోవచ్చు.

ఒకవేళ విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి కోసం తెలంగాణ వాదాన్ని జానారెడ్డి అడ్డం పెట్టుకున్నది నిజమేనని అనుకుందాం. మరి, చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి రాలేదని కేసీఆర్ టీఆర్ ఎస్ ను స్థాపించలేదా? టీఆర్ ఎస్ స్థాపించడానికి, తెలంగాణ కోసం ఉద్యమించడానికి అప్పట్లో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడమే కదా కారణం. అటువంటప్పుడు మంత్రి పదవుల కోసం జానారెడ్డి ఎంత అడ్డుపెట్టుకున్నాడో కేసీఆర్ కూడా అంతే వాడుకున్నట్లు అవుతుంది కదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక, తెలంగాణ సాధనలో అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా పని చేసింది జేఏసీ. జేఏసీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన జానారెడ్డిదే. డిసెంబరు 9 ప్రకటన తర్వాత సీమాంద్ర నాయకులు పదవులకు రాజీనామాలు చేశారు. దాంతో తెలంగాణ ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోయింది. ఆ సమయంలోనే జానారెడ్డి ఇంటికి కేసీఆర్ వెళ్లారు. అక్కడే జేఏసీ ఆలోచన పురుడు పోసుకుంది. అన్ని పార్టీలూ అందులోకి వచ్చేలా జానారెడ్డి క్రియాశీల పాత్ర పోషించారు. అప్పట్లో జేఏసీ ఏర్పడకపోయి ఉంటే, అన్ని పార్టీలూ ప్రజా సంఘాలూ అందులో చేరి మూకుమ్మడి పోరాటం చేయకపోయి ఉంటే తెలంగాణను కేసీఆర్ సాధించేవాడే కాదు. ఇందులో ఎటువంటి శషబిషలూ అక్కర్లేదు. అలాగే, ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి పదవికి ఒక సందర్భంలో జానారెడ్డి పేరు పరిశీలించారు. అప్పట్లో ఆయనకు సీఎం పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ అప్పట్లో సాకారం అయి ఉండేది కాదు. అయితే, రాజకీయ నాయకులు తమ తమ రాజకీయాలనే పరిగణనలోకి తీసుకుంటారు. తప్పితే వారికి నిజానిజాలతో పనిలేదు.