Begin typing your search above and press return to search.

మీడియా గురించి కేసీఆర్ ఏమన్నారంటే..

By:  Tupaki Desk   |   25 Sep 2016 10:05 AM GMT
మీడియా గురించి కేసీఆర్ ఏమన్నారంటే..
X
అతి భారీగా కురుస్తున్న వర్షాలతో గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్ లో ఏర్పడిన పరిస్థితి తెలిసిందే. కాలనీల్లోకి నీళ్లు వచ్చేయటం.. పెద్ద ఎత్తున అపార్ట్ మెంట్ల సెల్లార్లు నీళ్లలో మునిగిపోవటం.. ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. వీటిపై మీడియా స్పందించి.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్ల గురించి పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. అతి భారీగా కురుస్తున్న వర్షాలపై అధికారులు చేష్టలుడిగిపోయినట్లుగా ఉండిపోవటంతో మీడియా ఈ అంశాలపై మరింత ఫోకస్ చేసింది.

నేటి పోటీ ప్రపంచంలో ఒకరి కంటే ఇంకొకరు ముందుండాలన్న పోటీతత్వంతో వరద బాధితుల గురించి వార్తల్ని భారీస్థాయిలో ఇవ్వటం మొదలైంది. దీంతో.. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందన్న భావన పెరగటంతో పాటు.. ప్రభుత్వ వ్యతిరేకత అనూహ్యంగా పెరిగిపోయింది. దీనికి తోడు ఈ పరిస్థితులపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఎటకారపు పోస్టింగ్ లు మొదలు కావటం.. స‌మ‌యం గ‌డిచే కొద్దీ వీటి తీవ్రత పెరిగిపోవటం.. ఇవన్నీ తెలంగాణ సర్కారు దృష్టికి వెళ్లాయి. తాజా వర్షాల ఎపిసోడ్ లో ప్రభుత్వ పరపతిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నష్టనివారణ మొదలుపెట్టారు. అతి భారీ వర్షాల కారణంగా ఒక్కరు కూడా మరణించకున్నా.. ఒక్క ఇల్లు కూలిపోకున్నా.. మీడియా ప్రదర్శిస్తున్న ఉత్సాహంతో హైదరాబాద్ నగరానికి చెడ్డపేరు వస్తుందన్నఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

శనివారం మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అదివారం మధ్యాహ్నం నిర్వహించిన రివ్యూలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించటమే కాదు.. మీడియా అతి చేయటం సరికాదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. వాస్తవ పరిస్థితులు మాత్రమే మీడియా చూపాలని హితవు పలికిన కేసీఆర్.. పరిస్థితిని అతిగా చూపించి.. ఇతర ప్రాంతాల్లోని ప్రజలకు ఆందోళన కలిగించొద్దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాక న్యూస్ ఛానళ్ల వార్తల్లో ఎలాంటి మార్పు వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదేమో..?