Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా మారిన కేసీఆర్‌.. ర‌క్తం ఏరులై పారే మాట‌!

By:  Tupaki Desk   |   30 Nov 2017 11:31 AM GMT
వైర‌ల్ గా మారిన కేసీఆర్‌.. ర‌క్తం ఏరులై పారే మాట‌!
X
మాట బ‌లి కోరుకుంటుంద‌న్న‌ది పెద్దోళ్లు చెప్పిన స‌ద్ద‌న్నం మాట‌. వాడుక‌లో ఈ సామెత పెద్ద పాపుల‌ర్ కాన‌ప్ప‌టికీ.. కొన్ని విష‌యాల్ని చూసిన‌ప్పుడు అప్ర‌య‌త్నంగా ఈ మాట గుర్తుకు వ‌చ్చేస్తుంది. ఇప్పుడున్న టెక్నాల‌జీతో పోలిస్తే..ఎలాంటి సాంకేతిక‌త లేని రోజుల్లోనే వంద‌ల ఏళ్లు అలా నిలిచిపోయే మాట‌ను చెప్పిన పెద్దోళ్ల తెలివికి ఫిదా కావాల్సిందే.

అందుకే అంటారు నోటి వెంట మాట వ‌చ్చే ముందు ఒక‌టికి ప‌దిమార్లు ఆలోచించుకొని మాట్లాడ‌మ‌ని. ఉద్య‌మ రాజ‌కీయాలు న‌డిపిన కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధ‌న త‌ప్పించి మ‌రో ఆలోచ‌న ఉండేది కాదు కేసీఆర్ కు.

అలా అని ఆయ‌న కేవ‌లం ఉద్య‌మ రాజ‌కీయాలు మాత్ర‌మే న‌డిపారా? అంటే.. లేద‌నే చెప్పాలి. కాకుంటే.. చుక్కాని లేని నావ‌లా సాగుతున్న తెలంగాణ ఉద్య‌మాన్ని ఒక గాటున పెట్ట‌ట‌మే కాదు.. ప‌ద్ద‌తిగా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధ‌న అవ‌శ‌క్య‌త‌ను తెలియ‌జెప్ప‌టం.. తెలంగాణ రాష్ట్రాన్ని కోర‌టంలో ఉన్న న్యాయాన్ని.. అందుకు త‌గ్గ వాద‌న‌ను స‌మ‌ర్థంగా వినిపించిన ఘ‌నత కేసీఆర్‌ కు ద‌క్కుతుంది. ఇదే ఆయ‌న్ను తెలంగాణ ఉద్య‌మ ఛాంపియ‌న్ గా మార్చింది.

ఉద్య‌మ సంద‌ర్భంగా కేసీఆర్ నోటి నుంచి తూటాల్లాంటి మాట‌లు చాలానే వ‌చ్చాయి. ఉద్య‌మ వేడిలో ఆయ‌న నోటి నుంచి కాస్త అటుఇటు వ‌చ్చిన మాట‌ల్ని ఖండించిన పాపాన పోలేదు. అలాంటి ప్ర‌య‌త్నం జ‌రిగితే ఎక్క‌డ తెలంగాణ ద్రోహిగా ముద్ర ప‌డుతుందేమోన‌న్న భ‌యంతో ఎవ‌రూ నోరు విప్పేందుకు ఇష్ట‌ప‌డే వారు కాదు.

చివ‌ర‌కు ఎంత మాట అన్నా కేసీఆర్‌ కు ఎదురు మాట్లాడే ద‌మ్ము.. ధైర్యం చేసే వారు కాదు. అదే.. మెట్రో రైల్ మీద వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే వ‌ర‌కూ వెళ్లింది. మెట్రో రైలు అలైన్ మెంట్‌ ను తీవ్రంగా వ్య‌తిరేకించిన కేసీఆర్‌.. వెంట‌నే మార్చాల‌ని డిమాండ్ చేశారు. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న‌.. అలైన్ మెంట్ మార్చ‌కుండా నిర్మాణం జ‌రిపిన ప‌క్షంలో ర‌క్తం ఏరులై పారినా వెన‌క్కి త‌గ్గేది లేద‌ని భీష‌ణ ప్ర‌తిన చేశారు.

ఆయ‌న అన్న మాట‌ల్ని య‌థాత‌థంగా చూస్తే.. "ఇక్క‌డ ఎవ‌రూ అమాయ‌కులు లేరు. రేప‌టి నుంచి దుమ్ము రేపుతాం. మెట్రో రైలును వెంట‌నే ఆపాలి. మెట్రో లైన్ ప్రాజెక్టును నేను ముఖ్య‌మంత్రిగారిని.. ఎల్ అండ్ టీ వారిని హెచ్చ‌రిస్తున్నా.. హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌క్తం ఏరులై పారినా స‌రే.. మెట్రో రైలును అనుమ‌తించం. మీ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎవ‌రూ హైద‌రాబాద్ న‌గ‌రంలో ఒక గ‌జం కూడా తిర‌గ‌లేరు త‌స్మాత్ జాగ్ర‌త్త" అంటూ హెచ్చ‌రించిన మాట‌ల వీడియో క్లిప్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైర‌ల్ గా మారింది.

ఎంతో న‌మ్మ‌కంగా.. మ‌రెంతో ఆవేశంగా.. భారీ క‌మిట్ మెంట్ తో ఉన్న‌ట్లుగా కేసీఆర్ చెప్పే మాట‌లు విన్న‌ప్పుడు.. నిజ‌మే అనిపిస్తాయి. కానీ.. వాస్త‌వంలోకి వెళితే అందులో నిజం పాళ్లు ఎంత‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. బ‌హిరంగ స‌భ‌లో అంత పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడిన పెద్ద‌మ‌నిషి.. ఈ రోజున ఎలాంటి అలైన్ మెంట్ మార‌కుండానే ప్ర‌ధాని మోడీని ప‌క్క‌న పెట్టుకొని మెట్రో రైల్‌ ను ఓపెనింగ్ చేసిన వైనం ఇప్పుడు ఆన్ లైన్ లో వైర‌ల్ గా మారింది. మెట్రో రైల్ మైలేజ్ త‌మ‌దే సొంత‌మ‌ని.. త‌మ క్రియేటివిటీతో అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ అండ్ కోకు ఏరులై పారాలన్న మాట‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు త‌ల‌నొప్పిగా మారింది. మెట్రో అలైన్ మెంట్ కోసం అంత పెద్ద మాట అన్న కేసీఆర్‌.. ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయ‌కుండానే.. అలైన్ మెంట్ లో ఛేంజ్ గురించి మాట్లాడ‌కుండా కామ్ గా ఉంటున్న కేసీఆర్‌కు తాజా వీడియో క్లిప్ త‌ల‌నొప్పిగా మారింది. అలైన్ మెంట్ మీద క్లారిటీ ఇవ్వ‌ని కేసీఆర్ అండ్ కోకు పాత వీడియో క్లిప్ విష‌యంలో ఏం స‌మాధానం చెప్పాలో అర్థం కాక త‌ల‌ప‌ట్టుకునే ప‌రిస్థితి నెల‌కొంది.