Begin typing your search above and press return to search.

ఏ సంద‌ర్భంలోనూ సారు వంద‌కు త‌గ్గ‌ట్లేద‌ట‌!

By:  Tupaki Desk   |   4 Oct 2018 6:22 AM GMT
ఏ సంద‌ర్భంలోనూ సారు వంద‌కు త‌గ్గ‌ట్లేద‌ట‌!
X
ఉత్సాహం ఉండాల్సిందే. అది కాస్తా అత్యుత్సాహంగా మారితే తిప్ప‌లే. కాన్ఫిడెన్స్ ఉండ‌టం చాలా అవ‌స‌రం. కానీ.. అది కాస్తా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అయితే మొద‌టికే మోసం వ‌స్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు ఇలాంటి సందేహాల్నే వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తోంది.

ముంద‌స్తుకు వెళ్లటానికి నెల‌ల త‌ర‌బ‌డి అధ్య‌య‌నాల మీద అధ్య‌య‌నాలు.. సర్వే రిపోర్టుల‌ను తీవ్రంగా మ‌దించి.. శోధించిన త‌ర్వాతే ముంద‌స్తు ఆట‌కు కేసీఆర్ సిద్ద‌మైన‌ట్లుగా చెబుతారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలుపు ప‌క్కా అన్న స‌ర్వే జోస్యాలు కేసీఆర్‌లో విప‌రీత‌మైన ఆత్మ‌విశ్వాసాన్ని పెంచేసిన‌ట్లుగా తెలుస్తోంది. స‌ర్వేల మీద మ‌ళ్లీ మ‌ళ్లీ స‌ర్వేలు చేయించ‌టం.. 360 డిగ్రీస్ లో భారీ ఎత్తున శాంపిల్స్ తో స‌మాచారాన్ని సేక‌రించి.. నిఘా వ‌ర్గాల అంచ‌నాల‌ను తాను చేయించిన సర్వేల‌తో స‌రిపోల్చ‌టం ద్వారా ముంద‌స్తు గోదాలోకి కేసీఆర్ దిగిన‌ట్లుగా చెబుతారు.

అయితే.. ఎన్నిక‌ల మూడ్ కు ముందు.. ఎన్నిక‌ల ఊసే లేన‌ప్పుడు ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణికి మ‌ధ్య వ్య‌త్యాసం ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. రాజకీయాల్లో ఒక్క సంఘ‌ట‌న చాలు.. మొత్తం సీన్ మార్చేయ‌టానికి. తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న కేసీఆర్ కు..తెలంగాణ‌లో వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు కూడా పెద్ద‌గా స‌మ‌ర్థించ‌రు. ఎందుకంటే.. త‌న‌ మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను కేసీఆర్ మేనేజ్ చేయ‌గ‌ల‌ర‌ని.. ఆ ఆగ్ర‌హం వ్య‌తిరేక ఓటుగా మారి త‌న‌ను ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్ల‌ద‌న్న ధీమా కేసీఆర్‌లో కొండంత‌గా ఉంటుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది.

అయితే.. రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. ప్ర‌జ‌ల మూడ్ కేసీఆర్ అంచ‌నా వేసుకున్న‌ట్లే ఉంటుంద‌ని ఆశించ‌టం అత్యాశే అవుతుంద‌ని చెప్పాలి. ఇదే కేసీఆర్ కాన్ఫిడెన్స్ ను.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ గా మార్చేసింద‌ని చెప్పాలి. అదీ కాక‌.. ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం లేన‌ప్పుడు ప్ర‌జ‌ల మూడ్‌ కి.. ఒక్క‌సారి ఎన్నిక‌ల ఫీవ‌ర్ ప్ర‌జ‌ల‌కు ప‌ట్టేసిన త‌ర్వాత చోటు చేసుకునే ప‌రిణామాలు ఓట‌ర్ల మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎక్క‌డి వ‌ర‌కో ఎందుకు.. అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన వేళ‌లోనూ.. ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. నిన్న‌టి నిజామాబాద్ స‌భ వ‌ర‌కూ కూడా టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల్లో ఎక్కువ‌మంది సెటిల‌ర్ల ఓట్లు త‌మ‌కే ప‌డ‌తాయ‌న్న ధీమాను వ్య‌క్తం చేసేవారు. ఆ మాట‌కు వ‌స్తే.. తెలంగాణ ఓట‌ర్ల కంటే కూడా సెటిల‌ర్ల ఓట్లు ప‌క్కాగా టీఆర్ఎస్‌కే ప‌డ‌తాయ‌న్న అభిప్రాయం ఉంది. కానీ.. నిజామాబాద్ స‌భ‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో సీమాంధ్ర మూలాలు ఉన్న వారెవ‌రూ.. కేసీఆర్‌ కు ఓటు వేయ‌టానికి ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ర‌న్న అభిప్రాయం బ‌లంగా ఉంది.

చంద్ర‌బాబును తిట్టే పేరుతో.. ఆంధ్రా.. ఆంధ్రా అంటూ ఆంధ్రోళ్ల‌ను అవ‌మానించేలా.. అగౌర‌వ‌ప‌ర్చేలా కేసీఆర్ మాట‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇలాంటివి రానున్న రోజుల్లో మ‌రిన్ని ఉదంతాల్ని చూడాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. మ‌రి.. ఇలా ఊహించ‌ని ప‌రిణామాల త‌ర్వాత కూడా వంద సీట్ల మీద‌నే కేసీఆర్ ఉండ‌టం ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కాక మ‌రేంటన్న మాట రాజ‌కీయ ప్ర‌ముఖుల నోటి నుంచి అదే ప‌నిగా వినిపిస్తోంది.