Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లో గుడ్ న్యూస్ తెలుస్తుందంటున్న‌ కేసీఆర్‌

By:  Tupaki Desk   |   5 April 2017 12:04 PM GMT
త్వ‌ర‌లో గుడ్ న్యూస్ తెలుస్తుందంటున్న‌ కేసీఆర్‌
X
తెలంగాణ‌లోని అధికార పార్టీ నేత‌ల‌కు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ తీపి క‌బురు చెప్పిన‌ట్లు స‌మాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం కసరత్తు ముమ్మరంగా చేస్తుంద‌ని దీంతో సీట్ల పెంపు ఖాయమన్న భరోసాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతలకు ఇచ్చినట్టు స‌మాచారం. ఈనెల 12వరకు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశముందని కేంద్ర వర్గాలు సంకేతాలివ్వడంతో గులాబీపార్టీ నేతల్లో కొత్త ఊపు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన తమకు రాజకీయంగా మేలు చేస్తుందని టీఆర్‌ ఎస్‌ వర్గాలు ఆనందంగా ఉన్నాయి. సీట్లు పెరగటం పక్కా అని సీఎం కేసీఆర్‌ నమ్మకంగా ఉన్నట్లు పలువురు పార్టీనేతలు తెలిపారు.

సీఎం కేసీఆర్ ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన పలు సమావేశాల్లో నియోజకవర్గాల పెంపు అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లు సమాచారం. నియోజకవర్గాలు పెరిగితే.. కొత్తగా అనేకమందికి పోటీచేసే అవకాశం వస్తుందని, ఇది పార్టీకి కూడా మంచి పరిణామమని కేసీఆర్‌ విశ్లేషించినట్లు సమాచారం. పునర్విభజన జరిగితే తమ నియోజకవర్గ హద్దులు మారడంతో పాటు రిజర్వేషన్లు కూడా మారుతాయని నేతలు అంచనాల్లో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనే అసెంబ్లీ సీట్లను పెంచాలని టీఆర్‌ ఎస్‌ కోరింది. ప్రస్తుతమున్న 119సీట్లను 153కు పెంచాలని అపుడే కోరగా, దీనిపై ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ పేర్కొన్నారు. ఆది నుంచీ టీఆర్‌ ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుందని బలంగా చెబుతున్నారు. గతంలో హర్యానా విడిపోయినపుడు కూడా రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే సీట్ల పెంపు జరుగుతుందని, ఇపుడూ అదే రకంగా జరుగుతుందని చెబుతూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ సీట్ల పెంపుకు అంతగా ప్రయత్నించకున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం సీట్ల పెంపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రయత్నించింది. పునర్విభజన హామీలన్నీ ఒక్కొక్క టిగా నెరవేరుతుండగా, ఇపుడు నియోజకవర్గాల పునర్విభజన వంతు వచ్చింది. ఎపికి సీట్లు పెరిగితే.. తమకూ పెరుగుతాయని, ఈ అంశంపై ప్రత్యేకంగా తామేమీ ప్రయత్నించడం లేదని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ ఇటీవల అన్నారు.

2014లో టీఆర్ ఎస్‌ అధికారంలోకి వచ్చాక అనేకమంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో బలమైన నేతలు తమ పార్టీలను వీడి టీఆర్‌ఎస్‌ గూటికి వచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుండి 2014లో పోటీచేసిన అందరు అభ్యర్థులు కూడా టీఆర్‌ ఎస్‌ లోనే ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, సీట్ల ఖరారు పెద్ద సమస్యగా మారగా.. ఇపుడు నియోజక వర్గాల పునర్విభజన నేతలకు వరంగా మారింది. పార్టీకి కూడా పెద్ద ఉపశమనం కలిగించింది. తాజా పరిణామాలతో...అన్నీ మంచి శకునములే అన్న ఆనందంలో టీఆర్‌ఎస్‌ నేతలున్నారు. గ‌త వారంలో పార్లమెంట్‌ లో పునర్విభజన అంశంపై ప్రశ్న లేవనెత్తడం, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెంటనే స్పందించి.. కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ తో చర్చలు జరపడంతో బిల్లు తయారుచేస్తున్నట్లు సంకేతాలిచ్చారు. వీలైతే ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రవేశపెడతామని స్పష్టం చేయ‌డంతో గులాబీ నేత‌లు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/