Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు

By:  Tupaki Desk   |   23 Feb 2019 9:21 AM GMT
బ్రేకింగ్: ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు
X
సీఎం కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీలో నోరువిప్పారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో సగం ఉన్న మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వరా అని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.

దీనిపై సమాధానం ఇచ్చిన కేసీఆర్ మహిళలకు తీపికబురునందించారు. ఒక్కరు కాదు.. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తున్నామని.. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే కేబినెట్ లోకి తీసుకుంటామని తీపి కబురునందించారు.

తెలంగాణ కేబినెట్ లో మొత్తం 17మందికే చాన్స్ ఉందని.. సామాజిక - రాజకీయ - కుల - ప్రాంతీయ సమీకరణాలను బేస్ చేసుకొని ముందుగా పదిమందిని మంత్రులుగా తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలు ముగిశాక ఖచ్చితంగా తెలంగాణ కేబినెట్ లో ఇద్దరు మహిళలు మంత్రులుగా చేరుతారని తెలిపారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి పురుషుల కంటే కూడా మహిళలే ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారని.. వారి రుణం ఖచ్చితంగా తీర్చుకుంటామని.. పదవులిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

కేసీఆర్ ప్రకటనతో సభ చప్పట్లతో మారుమోగింది. ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఎవరా ఇద్దరనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం టీఆర్ ఎస్ లో సీనియర్ ఎమ్మెల్యేగా పద్మా దేవందర్ రెడ్డి - గొంగడి సునీత - రేఖానాయక్ లు ఉన్నారు. ఈ ముగ్గురిలో పద్మా - సునీత - రేఖాలల్లో ఇద్దరికి ఖచ్చితంగా చోటు దక్కుతుందన్న చర్చ సాగుతోంది. పద్మాకు కచ్చితం కాగా రేఖ - సునీతల్లో ఒకరికి చాన్స్ ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రెండో తెలంగాణ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇస్తానని కేసీఆర్ ప్రకటించడంతో ఇక వివాదాలకు పుల్ స్టాప్ పడినట్టైంది.