Begin typing your search above and press return to search.

అధికారం శాశ్వ‌తం కాదంటున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   29 Dec 2016 10:12 AM GMT
అధికారం శాశ్వ‌తం కాదంటున్న కేసీఆర్‌
X
భిన్న‌మైన రాజ‌కీయ‌వేత్తగా పేరున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో హ‌రిత హారం సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగిస్తూ ప్ర‌తిప‌క్షాల తీరుపై స్పందించారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో అధికారాలు రావడం పోవడం రోటీన్‌ అని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, మరో పార్టీ సభకు రాకపోవడం మంచిది కాదన్నారు. ఎన్నిరోజులైనా సభను జరుపుతామని, ఏ అంశమైనా చర్చిస్తామని చెప్పిన త‌ర్వాత‌ వివాదం ఎందుకు వస్తుందన్నారు. నిన్న త‌న స్పీచ్‌ విన్నాక మల్లన్న సాగర్‌ రైతులు త‌న‌కు ఫోన్‌ చేసి మాట్లాడారని, అభినందించార‌ని కేసీఆర్ తెలిపారు. రైతులు సైతం స్వీక‌రించిన త‌ర్వాత విప‌క్షాల‌కు ఎక్క‌డ‌, ఎందుకు ఇబ్బంది వ‌చ్చింద‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు.

హ‌రిత‌హారం కార్యక్ర‌మం గురించి మాట్లాడుతూ పచ్చదనం లేక ప్రకృతి సమతౌల్యం దెబ్బతిన్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి విచక్షణా రహితంగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని కేసీఆర్ తెలిపారు. ప్రపంచంలో మనిషికి సగటున 422 చెట్లు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో మనిషికి 28చెట్లు మాత్రమే ఉన్నయని ఆయ‌న వివ‌రించారు. గోబి ఎడారిలో 4.500 కిలోమీటర్ల పొడవునా మొక్కలను నాటారని, అమెజాన్ తీరంలో 100 కోట్ల మొక్కలు నాటారని కేసీఆర్ ప్ర‌స్తావించారు. మొక్కల పెంపకానికి 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని, అటవీ శాతాన్ని 33 శాతానికి పెంచాలన్నదే హరిత హారం లక్ష్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. అడవుల పరిరక్షణని గత పాలకులు విస్మరించి ఉమ్మడి ఏపీలో అడవుల సంరక్షణకు ఏటా రూ.14 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. అయితే త‌మ హ‌యాంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొదటి ఏడాది 15.86 కోట్ల‌ మొక్కలు - రెండో ఏడాది 31.67 కోట్ల మొక్కలు నాటినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

నాటిన మొక్కలకు నీరు పోసేందుకు, కాపాడేందుకు చర్యలు తీసుకున్నామ‌ని కేసీఆర్ వివ‌రించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొక్కల సంరక్షణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. అటవీ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం సమృద్ధిగా ఉందని, అడవులు లేని చోట తీవ్ర దుర్బిక్షం ఉందని కేసీఆర్ తెలిపారు. హ‌రితహారం ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా సాగుతున్నదని ఈ మహాయజ్ఞం నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అటవీ శాఖను బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా 2143 కొత్త వాహనాలను సమకూర్చామ‌ని, కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌లు కేసులు నమోదు చేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/