Begin typing your search above and press return to search.

రాహుల్ ముఖం క‌నిపించ‌కుండా చేసిన కేసీఆర్ లేదా

By:  Tupaki Desk   |   14 Aug 2018 6:06 AM GMT
రాహుల్ ముఖం క‌నిపించ‌కుండా చేసిన కేసీఆర్ లేదా
X
కేసీఆర్ అంటే ఆషామాషీ కాద‌న్న విష‌యాన్ని మ‌రోసారి నిరూపించార‌ని చెప్పాలి. ఎదుటివాడికి ద‌క్కే మైలేజీని ద‌క్క‌కుండా చేయ‌టంలో కేసీఆర్ దిట్ట‌. కేసీఆర్ ఏంది? మ‌రీ.. ఇంత చిన్న విష‌యాల మీద‌.. ఇంత సిల్లీగా ప్ర‌వ‌ర్తిస్తార‌న్న సందేహం అక్క‌ర్లేదు. సిల్లీ అని మీరు అనుకోవ‌చ్చు కానీ.. మీడియా అస‌రాతో తెలంగాణ ఉద్య‌మాన్ని నిర్మించి.. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి.. త‌న ల‌క్ష్యాన్ని సాధించుకున్న ఆయ‌న‌కు మీడియా ఎంత ప‌వ‌ర్ ఫుల్ అన్న‌ది బాగా తెలుసు. అందుకే.. అంద‌రి కంటే ఎక్కువ‌గా మీడియాను గ్రిప్ లో ఉంచుకోవ‌టానికి శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తుంటారు.

ఈ రోజు పొద్దున్నే నిద్ర లేచిన వెంట‌నే ఇంటికి వ‌చ్చిన పేప‌ర్ ను చూశారా? హైద‌రాబాద్‌ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న అంటే.. మ‌రో మాట‌కు అవ‌కాశం లేకుండా.. మొద‌టి పేజీలో బ్యాన‌ర్ ఐట‌మ్ గా రాహుల్ ప‌ర్య‌ట‌నే ఉంటుంది. బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ప్ర‌ముఖంగా రావ‌టం ఖాయం.

మ‌రి.. అలా జ‌రిగితే రాజ‌కీయంగా తెలంగాణ అధికార‌ప‌క్షం కేసీఆర్ స‌ర్కారుకు అంతో ఇంతో డ్యామేజ్ మాట ఖాయం. మ‌రి.. అలాంటి డ్యామేజ్ ను ఎలా క‌వ‌ర్ చేయొచ్చు. సీరియ‌స్ నెస్ ను ఎలా త‌గ్గించొచ్చు అన్న ప్ర‌శ్న‌కు కేసీఆర్ ద‌గ్గ‌ర ఇన్ స్టెంట్ గా స‌మాధానం ఉంటుంది.

రాహుల్ గాంధీ హైద‌రాబాద్ టూర్ గురించిన స‌మాచారం చాలా ముందుగానే డిసైడ్ చేశారు. కానీ.. టీఆర్ ఎస్ రాష్ట్ర క‌మిటీ స‌మావేశం ముందుగా డిసైడ్ చేసింది కాదు. రాహుల్ ప‌ర్య‌ట‌న రోజునే పార్టీ కీల‌క స‌మావేశాన్ని కేసీఆర్ ఎందుకు ఏర్పాటు చేశారంటే.. అదే కేసీఆర్ వ్యూహ‌మంటే. రాహుల్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న ప్ర‌భావాన్ని వీలైనంత త‌క్కువ చేసేందుకు వీలుగానే.. పార్టీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ త‌ర‌హా తెలివితేట‌లు కేసీఆర్ కు ఎక్కువే.

కావాలంటే చూడండి.. త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఏ ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసినా.. అదే రోజున ఏదో ఒక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాన్ని కేసీఆర్ చేప‌డ‌తారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలకు రావాల్సిన ప్ర‌చారం ద‌క్కుండా.. వారికిచ్చే ప్ర‌యారిటీలో త‌న వంతు బ‌ల‌వంతంగా తీసేసుకోవట‌మే కేసీఆర్ ప్లానింగ్ గా చెప్పాలి. కేసీఆర్ అనుకుంటే పార్టీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశాన్ని ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. కానీ.. స‌రిగ్గా రాహుల్ గాంధీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న రోజునే ఎందుకు పెట్టుకున్నార‌న్నోళ్ల‌కు ఈ రోజు పొద్దున్నే పేప‌ర్లు చూసినోళ్ల‌కు ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌మ ప్ర‌భుత్వం మ‌రో రోజు త‌ర్వాత అమ‌లు చేయ‌నున్న రెండు కొత్త ప‌థ‌కాల (కంటి వెలుగు.. రైతు బీమా)కు సంబంధించిన జాకెట్ యాడ్స్ ను ప్ర‌ముఖ ప‌త్రిక‌ల‌న్నింటికి ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. నిజానికి ప్ర‌భుత్వం ఏదైనా ముఖ్య‌మైన ప‌థ‌కాల్ని ప్రారంభించేట‌ప్పుడు.. ఆ ప‌థ‌కాల్ని అమ‌లు చేసే రోజున భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌టం సంప్ర‌దాయం. అందుకు భిన్నంగా ఒక రోజు ముందే నిలువెత్తు పేజీ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌టం.. అందులో కేసీఆర్ న‌వ్వుతూ ఉన్న ఫోటోతో పాటు.. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని అద్భుతాలైన ప‌థ‌కాలుగా ప్ర‌క‌టించ‌టం చూస్తే.. కేసీఆర్ ప్లానింగ్ ఏ రీతిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. కేసీఆర్ స‌ర్కారుపై రాహుల్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల్ని త‌న న‌వ్వుతున్న ఫోటో యాడ్ తో క‌వ‌ర్ చేసిన తీరు చూస్తే.. అద్గదీ కేసీఆర్ అంటే అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.