Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో ఇంకో రికార్డు సృష్టించిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   15 Jan 2019 8:17 AM GMT
అసెంబ్లీలో ఇంకో రికార్డు సృష్టించిన కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో ప్ర‌త్యేక‌త‌ను నమోదు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరనుంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన 119 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ప్రొటెం స్పీకర్‌ గా ఎంఐఎం సభ్యుడు ముంతాజ్ అహ్మద్‌ ఖాన్‌ తో బుధవారం గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. గురువారం ఎమ్మెల్యేలందరిచేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. తాజా శాసనసభలో అనేక విశేషాలున్నాయి. తాజాగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అందరికంటే సీనియర్ సభ్యుడిగా ఉన్నారు. అత్యధికసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అరుదైన రికార్డు సీఎం కేసీఆర్ సొంతమైంది. ఆయన తర్వాత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ ఖాన్ - రెడ్యానాయక్ - ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఉన్నారు. వీరు ముగ్గురు ఆరుసార్లు (టర్మ్) ఎమ్మెల్యేలుగా ఎన్నికైన రికార్డు సొంతం చేసుకున్నారు.

ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పార్లమెంటరీ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకొన్నారు. మొట్టమొదటి ఎన్నిక మినహాయిస్తే.. పోటీచేసిన అన్ని ఎన్నికల్లోనూ అప్రతిహతంగా గెలిచిన నాయకుడు కేసీఆర్. ఒక ఉపఎన్నికను తీసి వేస్తే మొత్తం ఏడు టర్మ్‌లు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. మరోసారి ఎంపీగా - ఎమ్మెల్యేగా పోటీచేసి ఎంపీ పదవి ఉంచుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేశారు. ప్రస్తుత శాసనసభలో ఎనిమిదిసార్లు శాసనసభకు గెలిచిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే కావడం గమనార్హం. 1985 నుంచి ఇప్పటివరకు పోటీచేసిన అన్ని ఎన్నికల్లోనూ ఆయనను విజయం వరించింది. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కంటే కేసీఆరే ఎక్కువసార్లు చట్టసభలకు ఎన్నికయ్యారు. శాసనసభా వ్యవహారాలకు సంబంధించిన పీఏసీ సహా అనేక కమిటీల్లో చైర్మన్‌ గా.. సభ్యుడిగా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా - ఇంచార్జి మంత్రిగా - ఉపసభాపతిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కూడా రికార్డు సృష్టించారు. వయసురీత్యా చాలామంది జాతీయ నేతలకంటే చిన్నవాడే అయినప్పటికీ - సమకాలీన దేశ రాజకీయాల్లో కేసీఆర్ వంటి నేత మరొకరు లేరు. సుదీర్ఘ పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని స్థాయిల్లో ఇన్ని రికార్డులున్నవారు అరుదనే చెప్పాలి. జాతీయస్థాయి నాయకుల్లో ఎలాంటి నేరచరిత్ర - అవినీతి మరకలు లేకుండా ఉన్న నాయకుడు కేసీఆరే.

కాగా, ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల్లో 23 మంది శాసనసభావ్యవహారాలకు పూర్తిగా కొత్తవారే. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో కాలుమోపుతున్నారు. వీరితోపాటు మరో ఐదుగురు కూడా అసెంబ్లీలో అడుగుపెడుతున్నప్పటికీ, చట్టసభలకు కొత్తవారు కాదు. వీరిలో బాల్క సుమన్ - చామకూర మల్లారెడ్డి ఎంపీలుగా - పట్నం నరేందర్‌ రెడ్డి - మైనంపల్లి హన్మంతరావు - కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్సీలుగా పనిచేశారు. అసెంబ్లీకి మాత్రం ఈ నలుగురు కొత్తవారే. ఇక గడచిపోయిన శాసనసభలో (2014-18) ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో 76 మంది తిరిగి ఎన్నికయ్యారు. గత శాసనసభలో నామినేటెడ్‌ గా ఉన్న స్టీఫెన్‌ సన్ తాజా అసెంబ్లీలో కూడా నామినేటెడ్ సభ్యుడు కావడం విశేషం. ఆయనతో కలిపితే మొత్తం 77 మంది గత అసెంబ్లీలోని సభ్యులు ప్రస్తుత అసెంబ్లీలోనూ కనిపించనున్నారు. 2009-2014 మధ్య శాసనసభ్యులుగా గెలిచి.. 2014-2018 మధ్య సభ్యులుగా లేనివారిలో 16 మంది తిరిగి సభకు వస్తున్నారు.