Begin typing your search above and press return to search.

కేసీఆర్ సై.. లక్ష మందితో ‘దళితబంధు’ సభ

By:  Tupaki Desk   |   4 Aug 2021 7:30 AM GMT
కేసీఆర్ సై.. లక్ష మందితో ‘దళితబంధు’ సభ
X
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసుపత్రిక ‘దళితబంధు’ పథకం. ఎంతో ఆలోచించి తెలంగాణలోని దళితులకు మేలు చేసేలా ఈ పథకాన్ని కేసీఆర్ తీర్చిదిద్దారు. ఈ పథకానికి ఈనెల 16న సీఎం హుజూరాబాద్ లోనే ప్రారంభించనున్నారు. హుజూరాబాదే ప్రస్తుతం దళితబంధు పథకానికి వేదిక కానున్నది.

హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి, ఇందిరానగర్ గ్రామాల మధ్య లక్షమంది దళితులతో భారీ బహిరంగ సభను నిర్వహించి ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.

రైతు బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సందర్భంలోనూ ఇక్కడే భారీ సభను నిర్వహించడం విశేషం. ఆ పథకం దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యి ఎంతో పేరును కేసీఆర్ కు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 16న నిర్వహించనున్న సభను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

దళిత బంధు పథకాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో దళితుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

హుజూరాబాద్ లో ఈ దళితబంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మొత్తం 20929 కుటుంబాలకు చెందిన వారికి 10 లక్షల రూపాయల మేర ఉపాధి కల్పించేందుకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభకు వారం రోజుల్లోగా ఏర్పాట్లు పూర్తి చేసేందుకు యాంత్రాంగం సన్నద్ధమవుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా దళిత ప్రజాప్రతినిధులు, రైతులు ఈ బహిరం సభకు రానున్నారని తెలిసింది.

ఇక ఇప్పటికే దళితబంధు ఏర్పాట్లపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. జిల్లా ఇన్ చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంక్షేమమంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టే బహిరంగ సభను విజయవంతం చేసే పనులు ప్రారంభించారు.

రైతు బంధు బహిరంగ సభను ఏర్పాటు చేసిన శాలపల్లి-ఇందిరానగర్ వద్దే ఈ బహిరంగ సభను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులు గంగుల కమలాకర్, ఈశ్వర్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, తదితరులు బహిరంగ సభా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. లక్షమంది పాల్గొననున్న ఈ బహిరంగ సభ స్థలాన్ని మంగళవారం పరిశీలించనున్నారు.