Begin typing your search above and press return to search.

బీజేపీతో కేసీఆర్ చీక‌టి ఒప్పందం.. సాక్ష్యాలు ఇవేః ఉత్త‌మ్

By:  Tupaki Desk   |   9 April 2021 3:30 PM GMT
బీజేపీతో కేసీఆర్ చీక‌టి ఒప్పందం.. సాక్ష్యాలు ఇవేః ఉత్త‌మ్
X
టీఆర్ఎస్ కు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు డ్ర‌గ్స్ దందాలో ఉన్నార‌ని, మ‌రో మంత్రి మ‌ల్లారెడ్డి బ‌హిరంగంగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్ ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోవ‌ట్లేద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

బెంగ‌ళూర్ డ్ర‌గ్స్ కేసులో ఎమ్మెల్యేలు ఇరుక్కుని తెలంగాణ ప‌రువు తీశార‌ని, వారిని అసెంబ్లీ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ భూ క‌బ్జాలు, ఇసుక‌, మ‌ద్యం డీల్ చేసిన టీఆరెస్ నేత‌లు.. ఇప్పుడు డ్ర‌గ్స్ లోనూ వేలు పెట్టార‌ని ఆరోపించారు. మంత్రి మ‌ల్లారెడ్డి ఇష్టారాజ్యంగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ఆయ‌న్ను ఎందుకు మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించ‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు.

బీజేపీతో టీఆర్ఎస్ చీక‌టి ఒప్పందాలు చేసుకుంద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. క‌ర్నాట‌క‌ బీజేపీతో మాట్లాడుకొని, ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసును ర‌ద్దు చేయించుకున్నార‌ని ఆరోపించారు. అదేవిధంగా.. సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ ఈ ఒప్పందాలు కొన‌సాగాయ‌ని అన్నారు. ఈ కార‌ణంగానే.. బీజేపీ బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టింద‌ని, త‌ద్వారా టీఆర్ఎస్ కు మేలు జ‌రిగేలా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు.

ఇక‌, సాగ‌ర్ ఉప ఎన్నిక నిష్ప‌క్ష‌పాతంగా సాగే ప‌రిస్థితి క‌నిపించ‌ట్లేద‌ని అన్నారు. డ‌బ్బు, మ‌ద్యం పంపిణి విచ్చ‌ల విడిగా కొన‌సాగుతోంద‌ని అన్నారు. వాటిని అడ్డుకోవ‌డంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, ఈ విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్తామ‌ని అన్నారు.