Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలోనూ ఆంధ్రాను ఏసుకున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   24 Aug 2016 4:43 AM GMT
మహారాష్ట్రలోనూ ఆంధ్రాను ఏసుకున్న కేసీఆర్
X
వేదిక ఏదైనా ఆంధ్రా మీద తనకున్న గుస్సాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శించేందుకు ఏ మాత్రం మొహమాట పడకూడదు. రెండు తెలుగురాష్ట్రాల మధ్యనున్న పంచాయితీలు ఎన్ని ఉన్నా.. రాష్ట్రం కాని రాష్ట్రంలో మరోరాష్ట్రం గురించి విమర్శలు చేయటం ఎంతవరకు సబబు? అన్నవిషయాన్ని పక్కన పెట్టేసి మరీ ఆంధ్రాతో తమకున్న ఇబ్బందిని కేసీఆర్ ఘాటు వ్యాఖ్య రూపంలో బయటపెట్టారని చెప్పాలి.

మహారాష్ట్ర సర్కారుతో చారిత్రక జల ఒప్పందం జరిగినట్లుగా చెబుతున్న తెలంగాణ సర్కారు.. అందుకు తగ్గట్లే మంగళవారం చారిత్రక ఘట్టాన్ని పూర్తి చేశారు. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి చెబుతూ.. ‘‘ఇరురాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం దేశానికే ఆదర్శం’’ అంటూ అభివర్ణించటం గమనార్హం. తమ రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉన్నాయన్న కేసీఆర్.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదంటూ దుయ్యబట్టారు. తమ్మిడిహెట్టితో మహారాష్ట్రతో జరిగే నష్టానికి బదులుగా మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు.

కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల మధ్యనున్న ప్రాజెక్టులు పూర్తి కాలేదన్న కేసీఆర్.. మహారాష్ట్రతో తగాదాలు లేవని.. ఏపీతో ఇంకా వివాదాలు ఉన్నట్లుగా వ్యాఖ్యానించటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ తో జలజగడాలు ముగిసిపోలేదని చెప్పిన కేసీఆర్.. ఎన్నోసార్లు చర్చలు జరిగినట్లుగా చెప్పారు. అదేసమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తాను స్నేహ హస్తంతో వచ్చిన విషయాన్ని చెప్పానని.. అందుకు ఆయన అంగీకరించారన్నారు. మహారాష్ట్రతో తాము ఎప్పుడూ సఖ్యతతో ఉంటామని.. స్నేహపూర్వక వాతావరణంలో ఇరురాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశమంతా నీటి యుద్ధాలు జరిగే సమయంలో మహారాష్ట్ర.. తెలంగాణలు పరస్పర సహకరాంతో ముందుకు పోతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఒప్పందం వల్ల ఇరు రాష్ట్రాలు లబ్థి పొందుతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.

అటు కేసీఆర్ మాటలు చూసినా.. ఇటు ఫడ్నవిస్ మాటలు చూసినా.. ఇద్దరికి లాభదాయకమైన ఒప్పందమే రెండు రాష్ట్రాల మధ్యజరిగిందే తప్పించి.. ఒకరి కోసం మరొకరు త్యాగం చేసిందేమీ లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈకారణం చేతనే ఇరు ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగిన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంతే విశాల దృక్ఫదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకు ఉండటం లేదు? ఇద్దరు చంద్రుళ్లు ఎందుకు భేటీ కారు? ఎందుకు మాట్లాడుకోరు? తెలుగోళ్ల మధ్య నీటి గొడవలు ఉన్నాయంటూ పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ వ్యాఖ్యానించే కేసీఆర్.. ఆ గొడవలకు పుల్ స్టాప్ పెట్టేలా తనకు తాను చేసిన పనులేమిటన్న విషయాన్ని ఆలోచించుకొని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగోళ్ల ప్రయోజనాల్నిదెబ్బ తీసేలా బాబ్లీని నిర్మించిన మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వానికి లెక్క కుదరగా లేనిది.. సాటి తెలుగు రాష్ట్రంతో మాట ఎందుకు కుదరదు? ప్రయత్నించి.. ఫలితం రాకపోతే విమర్శలు చేయటంలోఅర్థం ఉంది కానీ.. అలాంటిదేమీ జరగకుండానే విమర్శలు చేసుకోవటం వల్ల రెండు రాష్ట్రాల మధ్య దూరం మరింత పెరుగుతుందే తప్పించి తగ్గదన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు మర్చిపోతున్నట్లు చెప్మా..?