Begin typing your search above and press return to search.

కోడ్ ఉన్న వేళ ప్ర‌త్యేక టీ అసెంబ్లీ స‌మావేశం

By:  Tupaki Desk   |   15 April 2019 5:30 AM GMT
కోడ్ ఉన్న వేళ ప్ర‌త్యేక టీ అసెంబ్లీ స‌మావేశం
X
రాజు త‌లుచుకుంటే వ‌రాల‌కు.. దెబ్బ‌ల‌కు కొద‌వా? ఈ సామెత కేసీఆర్ విష‌యంలో అతికిన‌ట్లుగా క‌నిపిస్తుంది. స‌చివాల‌యానికి వెళ్ల‌ని ముఖ్య‌మంత్రిగా.. వీలైనంత ఎక్కువ‌గా ఫాంహౌస్ లో ఉంటార‌న్న పేరున్న సీఎం.. పెద్ద‌గా బ‌య‌ట‌కు రాకుండా ప‌నులు చ‌క్క‌దిద్ద‌టం.. అనూహ్య కార్య‌క్ర‌మాల్ని ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ ఇచ్చే రాష్ట్రాధినేత‌గా కేసీఆర్ నిర్ణ‌యాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. తాజాగా అలాంటి నిర్ణ‌య‌మే తీసుకొని అంద‌రూ అవాక్కు అయ్యేలా చేస్తున్నార‌ని చెప్పాలి.

అనునిత్యం తాను ప్ర‌జ‌ల కోస‌మే ప‌ని చేస్తాన‌ని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీదనే తాను దృష్టి పెడ‌తాన‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో కాకుండా చేత‌ల‌తో చేసి చూపించే వైఖ‌రి కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రెవెన్యూ శాఖ‌ను పూర్తిస్థాయిలో ప్ర‌క్షాళ‌న చేసి.. తాను అనుకున్న డిజైన్ ను అమ‌లు చేయాల‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యార‌ని చెప్పాలి. ఇందుకు త‌గ్గ‌ట్లు ఏం చేయాల‌న్న విష‌యంలో ఇప్ప‌టికే బ్లూప్రింట్ సిద్ధం చేసిన కేసీఆర్.. ఇప్పుడా అంశాన్ని అమ‌లు దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. రెవెన్యూ శాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు రెఢీ అయిన ముఖ్య‌మంత్రి అందుకు త‌గ్గ‌ట్లు కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. రెవెన్యూ శాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు వీలుగా అసెంబ్లీలో చ‌ట్టాన్ని రూపొందించ‌టం.. దానికి ఆమోదం ప‌ల‌క‌టం లాంటివి జ‌ర‌గాలి. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ‌.. అసెంబ్లీ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌టం క‌ష్ట‌మ‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ఎవ‌రూ అడ‌గ‌క‌ముందే.. అసెంబ్లీ స‌మావేశాన్ని నిర్వ‌హించుకోవ‌టానికి వీలుగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగానే పండుగ‌పూట గ‌వ‌ర్న‌ర్ ను ప్ర‌త్యేకంగా క‌లిసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు అసెంబ్లీ స‌మావేశ‌మంటే అందుకు ఈసీ అనుమ‌తి కావాలి. అందుకోసం లేఖ రాసేందుకు సిద్ధ‌మైన కేసీఆర్.. అసెంబ్లీ స‌మావేశానికి త‌గిన‌ట్లుగా ఏర్పాట్లు చేస్తున్నార‌ని చెప్పాలి. సీఎం కేసీఆర్ జోరు చూస్తుంటే.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడే ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాన్ని నిర్వ‌హించి.. రెవెన్యూ కొత్త చ‌ట్టాన్ని అమ‌లు చేసేందుకు అవ‌స‌ర‌మైన ప‌నుల్ని పూర్తి చేయ‌ట‌మే ల‌క్ష్య‌మ‌న్న‌ట్లుగా ఆయ‌న ధోర‌ణి ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేసీఆర్ ఒక‌సారి డిసైడ్ కావాలే కానీ.. ఇలాంటివెన్ని తెర మీద‌కు వ‌స్తాయో?