Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌ విజయం ఎలా ఉంటుందో తేల్చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   18 Oct 2021 5:10 AM GMT
హుజూరాబాద్‌ విజయం ఎలా ఉంటుందో తేల్చేసిన కేసీఆర్
X
హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో కండబలం ఎంత కీలకమో.. మైండ్ గేమ్ అంతే ముఖ్యం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ విషయం తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. ఉప ఎన్నికను ఒక అస్త్రంగా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లిన వైనం తెలిసిందే. ఎన్నికల వేళ.. కేసీఆర్ పోల్ మేనేజ్ మెంట్ మాత్రమే కాదు.. ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పాలన్న దానిపై ఆయన లెక్కలు ఆసక్తికరంగానే కాదు.. ఎప్పటికప్పుడు వినూత్నంగా ఉండటం కనిపిస్తుంది.

తాజాగా జరుగుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు గులాబీ బాస్ కేసీఆర్ కు ఎంత ప్రతిష్ఠాత్మకమన్నది తెలియంది కాదు. ఈ ఎన్నికలో ఆయన ఎంపిక చేసిన అభ్యర్థి కానీ విజయం సాధిస్తే.. తెలంగాణలో ఆయన అధిక్యతకు తిరుగులేదన్నది స్పష్టమైనట్లే. ఇటీవల కాలంలో అధికారపక్షంపైన విపక్షాల అధిక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఉప ఎన్నిక ఫలితం కీలకం కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక మీద తనకున్న అంచనాల్ని కేసీఆర్ వెల్లడించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థే కచ్ఛితంగా గెలుస్తారని నమ్మకంగా చెప్పిన కేసీఆర్.. బీజేపీ కంటే టీఆర్ఎస్ కు 13 శాతం ఓట్లు ఎక్కువ రానున్నట్లు వెల్లడించారు. ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానంటూ.. ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అనే కన్ఫ్యూజన్ ను కూడా తేల్చేశారు.

ఈ నెల 26కానీ 27కానీ హుజూరాబాద్‌ లో సభ ఉంటుందన్న ఆయన.. ఉప ఎన్నికలో విజయం పక్కా అన్న మాటను బలంగా వినిపించటం ఆసక్తికరంగా మారింది. గెలుపు ధీమా ఓకే కానీ.. అధిక్యత ఎంతన్న విషయానికి సంబంధించి ఓట్ల శాతాన్ని సైతం ప్రకటించిన కేసీఆర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. మరి.. ఈ వ్యాఖ్యలకు బీజేపీ అభ్యర్థిగా బరిలోకిదిగిన ఈటల రాజేందర్ ఏమంటారన్నది ఇప్పుడు ఆక్తికరమైంది.