Begin typing your search above and press return to search.
కేసీఆర్ నిర్ణయం 12వేల మందిని బెదిరించడానికేనట
By: Tupaki Desk | 22 Oct 2017 5:11 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు - నిర్ణయాలు సంచలనాత్మకంగా....విభిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్రజలను ఆకట్టుకునేందుకు కొన్ని...పలు వర్గాలు చేరువ అయ్యేందుకు మరికొన్ని అనూహ్యమైన నిర్ణయాలు - పథకాలను ప్రకటించిన తెలంగాణ సీఎం...తాజాగా దాదాపు 12వేల మందిని బెదిరించేందుకు ఓ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే రేషన్ సరుకులకు బదులుగా నగదు బదిలీ చేసే పథకం.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్లు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రేషన్ షాపుల ద్వారా అందే నిత్యావసర సరుకు పంపిణీలో అక్రమాలు తొలగించడానికి లబ్ధిదారులకు సంపూర్ణ ప్రయోజనం అందించేందుకు అనువైన విధానాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ``ప్రతీ ఏటా రూ.6500 కోట్ల ఖర్చుతో పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం అఖిలభారత సర్వీసు అధికారులతో పాటు ఎంతో మంది అధికారులు - సిబ్బంది పనిచేస్తున్నారు. రూ.వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి. అధికారుల సమయం పోతోంది. అయినా సరే ఆశించిన ఫలితం రావడం లేదు. లబ్ధిదారులకు అందించాల్సిన బియ్యం - ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాలకు మాఫియానే ఏర్పడింది. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంపై రోజూ వస్తున్న వార్తలు వెలుగు చూస్తున్న అక్రమాలు మనోవేదన కలిగిస్తున్నాయి. ఇంత ఖర్చు చేస్తూ ఎంతో శ్రమించినా చెడ్డపేరు రావడం బాధ కలిగిస్తోంది. ఈ పరిస్థితి పోవాలి. పేదల కోసం పెడుతున్న ఖర్చు నూటికి నూరుశాతం పేదలకు ఉపయోగపడాలి. ఇందుకోసం ఓ మంచి విధానం అమలు చేయాలి. నిత్యావసర సరుకులకు బదులుగా అంతే మొత్తం నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేసే అంశాన్ని పరిశీలించాలి`` అని సీఎం కేసీఆర్ అధికారులు సూచించారు.
రేషన్ షాపుల ద్వారా అందించే నిత్యావసర సరుకు పంపిణీలో అక్రమాలు తొలగించడానికి అంటూ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ స్కీం వెనుక దాదాపుగా 12వేల మంది రేషన్ డీలర్లను బెదిరించే ఎత్తుగడ ఉందని అంటున్నారు. లబ్ధిదారులు ఆసక్తి చూపించక - అందుబాటులో లేక - మరికొన్ని కారణాల వల్ల రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ కు తరలుతున్నాయి. వీటివల్ల పలువురు రేషన్ డీలర్లు లబ్ధిపొందుతున్నది నిజం. అయితే వారు పలు డిమాండ్ల సాధన కోసం సమ్మె సమయంలోనే నగదు బదిలీ ఎత్తుగడ తేవడం వెనుక....ఈ అధనపు సంపాదనకు బ్రేక్ వేయడమే సీఎం కేసీఆర్ ఎత్తుగడ అని అంటున్నారు. నగదు బదిలీ అంటే...నేరుగా వినియోదారుడి ఖాతాలోకే సొమ్ములు బదిలీ అవుతాయి. తద్వారా ఇప్పుడు వచ్చే ఆ కాస్త ఆదాయం కూడా డీలర్లు కోల్పోతారు. ఈ నేపథ్యంలో సమ్మె అంశం పక్కనపెట్టి...కాళ్ల బేరానికి వస్తారని కేసీఆర్ అంచనా వేసినట్లున్నారని చెప్తున్నారు.