Begin typing your search above and press return to search.

ధాన్యంతో భారీగా పెర‌గ‌నున్న‌ కేసీఆర్ ఇమేజ్

By:  Tupaki Desk   |   11 Jun 2017 5:39 AM GMT
ధాన్యంతో భారీగా పెర‌గ‌నున్న‌ కేసీఆర్ ఇమేజ్
X
సంప‌న్నుడి ధీమానే వేరుంటుంది. చేతిలో డ‌బ్బులే కాదు.. అంత‌కు మించిన ముందు చూపు.. వ్యూహ చ‌తుర‌త పుష్క‌లంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి వారి చేతుల్లో ప‌వ‌ర్ ఉంటే చిత్ర విచిత్ర‌మైన స‌న్నివేశాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఆవిష్కృత‌మ‌వుతుంటాయి. తాజాగా ధాన్యం కొనుగోలులో ప్ర‌భుత్వం కొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విష‌యంలో ఎక్క‌డ లేని ఉదార‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది.

గిట్టుబాటు ధ‌ర‌ను క‌ల్పించ‌టంలో విఫ‌ల‌మై.. మిర్చి రైతుల విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు ఎంత‌గా డ్యామేజ్ అయ్యిందో తెలిసిందే. అలా వ‌చ్చిన చెడ్డ‌పేరును.. ధాన్యం కొనుగోలుతో మార్చేసుకోవాల‌న్న‌ట్లుగా ప్ర‌భుత్వ తీరు ఉంద‌ని చెప్పాలి. రైతుల నుంచి ధాన్యం సేక‌రించేందుకు ఎంత ఖ‌ర్చుకైనా వెనుకాడొద్ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వ‌ట‌మే కాదు కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఎంత ధాన్యం సేక‌రించ‌గ‌లిగితే అంత ధాన్యాన్ని సేక‌రించి ఉంచుకోవాల‌ని.. ఎవ‌రు ఎంత పంట తెచ్చినా కాద‌న‌కుండా తీసుకోవాల‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. సేక‌రించిన ధాన్యానికి ఇవ్వాల్సిన మొత్తాల్ని వెంట‌నే చెల్లించాల‌ని.. పెండింగ్ అస్స‌లు ఉంచొద్ద‌ని తేల్చేశారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం పుణ్య‌మా అని గ‌త ఏడాది కంటే భారీగా ధాన్యాన్ని సేక‌రించింది తెలంగాణ స‌ర్కారు.

రాష్ట్రంలో ముందెన్న‌డూ లేనంత భారీగా వ‌రి పండ‌టంతో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ కొనుగోలు కేంద్రాల‌కు రికార్డు స్థాయిలో ధాన్యం వ‌స్తోంది. వ‌చ్చిన ధాన్యాన్ని వ‌చ్చిన‌ట్లుగా కొనుగోలు చేయ‌టం ద్వారా.. రైతుల్లో కొత్త ధీమా క‌ల్పించ‌టంతో పాటు.. వారి మోముల్లో సంతోషాన్ని పంచాల‌న్న‌దే కేసీఆర్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

కేసీఆర్ ఆదేశాల పుణ్య‌మా అని గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి 9 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈసారి 37 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యాన్ని సేక‌రించిన‌ట్లుగా ముఖ్య‌మంత్రికి అధికారులు చెప్పారు. 2013-14లో గ‌రిష్ఠంగా 17 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం సేక‌రించ‌గా.. ఈసారి అందుకు రెండురెట్లు అద‌నంగా ధాన్యాన్ని సేక‌రించారు.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే సేక‌రించిన ధాన్యానికి రూ.5వేల కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉండ‌గా.. ఇప్ప‌టికి రూ.4వేల కోట్ల‌ను చెల్లించారు. అయితే.. పెండింగ్ ఉన్న రూ.వెయ్యి కోట్ల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేసి.. రైతుల‌కు బ‌కాయిలు అన్న‌దే లేకుండా చేయాల‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టంగా ఆదేశించారు. ఖ‌రీఫ్ స్టార్ట్ అయిన నేప‌థ్యంలో రైతుల‌కు పెట్టుబ‌డుల కోసం డ‌బ్బులు అవ‌స‌ర‌మ‌ని.. అందుకే ఎలాంటి పెండింగ్ లేకుండా వారికివ్వాల్సిన మొత్తాన్ని వెనువెంట‌నే ఇచ్చేయాల‌న్నారు. కేసీఆర్ దూకుడు చూస్తుంటే.. ధాన్యం కొనుగోలుతో అన్న‌దాత‌ల ముఖాల్లో సంతోషాన్నే కాదు.. రైతులకు స‌రికొత్త‌ ధీమాను క‌ల్పించేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/