Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిర్ణ‌యాన్నే ప్ర‌భావితం చేశారు!

By:  Tupaki Desk   |   17 March 2019 5:21 AM GMT
కేసీఆర్ నిర్ణ‌యాన్నే ప్ర‌భావితం చేశారు!
X
టీఆర్ ఎస్ లో కేసీఆర్ కు తిరుగులేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అధినేత‌ను క‌లిసేందుకు ఆయ‌న మంత్రి వ‌ర్గంలోని మంత్రుల‌కు కూడా అరుదుగా అవ‌కాశం ల‌భిస్తూ ఉంటుంద‌ని.. అది కూడా కేసీఆర్ మ‌న‌సుకు న‌చ్చితేనే అన్న మాట‌ను కొంద‌రు చెబుతుంటారు. మంత్రుల ప‌రిస్థితే ఇలా ఉంటే.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేల ప‌రిస్థితి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

అధినేత‌ను క‌లిసేందుకే అవ‌కాశం లేన‌ప్ప‌టికీ.. ఆ పార్టీ నేత‌లు ఎవ‌రూ కేసీఆర్ గురించి నెగిటివ్ గా మాట్లాడే సాహ‌సం చేయ‌రు. ఆ మాట‌కు వ‌స్తే.. అలాంటి ఆలోచ‌న త‌మ మ‌దిలోకి రావ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. త‌మ మ‌న‌సులోకి వ‌చ్చిన భావ‌న‌ను సైతం కేసీఆర్ గుర్తించే స‌త్తాతో పాటు.. ఆ విష‌యాన్ని ఆయ‌న నోట్ చేసుకుంటార‌ని.. అందుకు త‌గ్గ మూల్యం త‌ర్వాత ఏదో ఒక సంద‌ర్భంలో చెల్లించ‌క త‌ప్ప‌ద‌న్న మాట‌ను చెబుతారు. ఈ కార‌ణంతోనే.. కేసీఆర్ గురించి ఒక్క నెగిటివ్ మాట మాట్లాడే వారు క‌నిపించ‌రు.

కేసీఆర్ అంటే సొంత పార్టీ నేత‌ల‌కే కాదు.. కుటుంబ స‌భ్యులకు సైతం వ‌ణుకేన‌ని చెబుతారు. త‌న‌కు స‌ల‌హా ఇచ్చేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తే.. వారిని దూరం పెట్టేయ‌టం గులాబీ బాస్ కు అల‌వాటుగా చెబుతారు. కేసీఆర్ కు స‌ల‌హా చెప్పొచ్చు.. కానీ అది స‌ల‌హా రూపంలో ఉండ‌కూడ‌దు. సూచ‌న‌గా ఉండాల‌న్న మాట‌ను చెబుతారు. మాట్లాడే ప్ర‌తి మాట‌ను.. ప్ర‌తి అక్ష‌రాన్ని ఆయ‌న గ‌మ‌నిస్తూ ఉంటార‌ని చెబుతారు. ఈ కార‌ణంతోనే కేసీఆర్ తో మాట్లాడ‌టం అంత తేలికైన ముచ్చ‌ట కాద‌న్న మాట‌ను ఆయ‌న గురించి బాగా తెలిసిన వారు చెబుతుంటారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ నిర్ణ‌యాన్ని కాద‌నే ద‌మ్ము.. ధైర్యం గులాబీ పార్టీలో లేద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటివేళ‌లో తాజాగా జ‌రిగిన ఒక స‌మావేశం కేసీఆర్ త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకునే వ‌ర‌కూ వెళ్ల‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. కేసీఆర్ సారు ఒక‌సారి డిసైడ్ అయితే.. ఎవ‌రూ ఆ నిర్ణ‌యాన్ని మార్చ‌లేర‌న్న‌ది తెలిసిందే. ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఒక‌ట్రెండు అసెంబ్లీ అభ్య‌ర్థుల‌కు సంబంధించి కేసీఆర్ కు అభ్యంత‌రం ఉంద‌న్న మాటపై జోరుగా ప్ర‌చారం సాగింది. అయిన‌ప్ప‌టికి ఆయ‌న ఆ పేర్ల‌ను మార్చి.. తాను కోరుకున్న వారి పేర్ల‌ను తెర మీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోయిన‌ట్లుగా చెబుతారు.

ఎన్నిక‌ల బ‌రిలో పార్టీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని నిల‌పాల‌న్న విష‌య‌మై కేసీఆర్ ను ప్ర‌భావితం చేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. అలాంటిది తాజాగా చోటు చేసుకున్న సీన్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌డిచిన కొద్ది రోజులుగా ఎంపీ అభ్య‌ర్థుల్ని ఫైన‌ల్ చేసే విష‌య‌మై ప‌లు స‌మీక‌ర‌ణాల్ని ప‌రిశీలిస్తూ.. పేర్ల‌ను ఫైన‌ల్ చేసేందుకు కేసీఆర్ ప్ర‌త్యేక క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా జ‌హీరాబాద్ ఎంపీ అభ్య‌ర్థిగా బీబీ పాటిల్ పేరును కేసీఆర్ డిసైడ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఆయ‌న ఎంచుకున్న ప్ర‌మాణాల ప్ర‌కారం స‌ర్వేలోనూ.. ఆయ‌న జ‌రిపిన వ్య‌క్తిగ‌త ఎంక్వ‌యిరీలోనూ పాటిల్ అభ్య‌ర్థిత్వానికి సానుకూల స్పంద‌న ల‌భించింది. దీంతో.. ఆయ‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ అనుకున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వ‌హించిన జ‌హీరాబాద్ స‌భ‌కు పాటిల్ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఆయ‌న పేరును అధికారికంగా ప్ర‌క‌టించ‌ట‌మే మిగిలి ఉంద‌న్న వేళ‌.. అనూహ్య ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది.

పాటిల్ అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకిస్తూ ఎమ్మెల్యేలు గంప గోవ‌ర్ద‌న్‌.. క్రాంతి కిర‌ణ్.. భూపాల్ రెడ్డి.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ర‌వీంద‌ర్ రెడ్డిలు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి వ‌ద్ద స‌మావేశ‌మైన‌ట్లుగా స‌మాచారం. ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని తాము అంగీక‌రించ‌మ‌ని.. మ‌రో అభ్య‌ర్థిని బ‌రిలోకి నిల‌పాల‌ని సీఎంకు సూచ‌న చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా సంకేతాలు పంపారు.

పాటిల్ కు బ‌దులుగా ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్ రెడ్డి కానీ పార్టీ నేత అశోక్ త‌దిత‌ర పేర్ల‌ను ప‌రిశీలించాల్సిందిగా త‌మ బాస్ కు చెప్పాల‌ని భావించారు. అయితే.. ఈ విష‌యాల్ని గుర్తించిన కేసీఆర్.. త‌న నిర్ణ‌యాన్ని ప‌క్క‌న పెట్టేసి.. పాటిల్ అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించ‌కుండా ఆపేశారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యానికి భిన్నంగా చోటు చేసుకున్న ప‌రిణామం ఇప్పుడు గులాబీ పార్టీలో ఆస‌క్తిక‌రంగా మారింది. ఫ‌ర్లేదు.. కేసీఆర్ నిర్ణ‌యాన్ని ప్ర‌భావితం చేసేటోళ్లు గులాబీ పార్టీలో ఉన్నార‌న్న మాట‌.