Begin typing your search above and press return to search.

కేంద్రంతో కేసీఆర్ పోరాటం..అజెండా రెడీ

By:  Tupaki Desk   |   6 Aug 2017 5:51 AM GMT
కేంద్రంతో కేసీఆర్ పోరాటం..అజెండా రెడీ
X
ఇటీవ‌ల కేంద్ర‌ప్ర‌భుత్వం - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో స‌ఖ్య‌త కొన‌సాగిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పంథా మార్చుకున్నారు. కేంద్రంతో న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు బ‌హిరంగంగా ప్ర‌క‌టించేశారు. తెలంగాణ సీఎంకు ఇంత‌గా మంట‌పుట్టించేందుకు కార‌ణం..కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌న్నుల సంస్క‌ర‌ణ అయిన జీఎస్టీ అమ‌లు. అందులో మార్పుల విష‌యంలో త‌మ అభ్య‌ర్థ‌న‌ల‌ను కేంద్రం గౌర‌వించ‌క‌పోవ‌డం గురించి! జీఎస్టీ శ్లాబ్‌ లో భాగంగా ప్రస్తుత ఐదు శాతం పన్నును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నా కేవలం 12% శ్లాబులోకి మార్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించడంపై సీఎం కే చంద్రశేఖర్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఆదివారం ప్రధానికి సీఎం లేఖ రాయనున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిషన్ కాకతీయ - మిషన్ భగీరథ - సాగునీటి ప్రాజెక్టులు - డబుల్ బెడ్‌ రూం ఇండ్లు - రోడ్ల నిర్మాణం తదితర పథకాలపై జీఎస్టీ పేరుతో 18% పన్నును విధించడం సహేతుకం కాదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ నుంచి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ - మున్సిపల్ - ఐటీ మంత్రి కే తారకరామారావు - టీఆర్‌ ఎస్ ఎంపీల వరకు అందరు అనేకమార్లు జీఎస్టీ విషయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విన్నవించారు. రాష్ట్రంపై భారం గురించి పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించారు. గత జీఎస్టీ కౌన్సిల్ భేటీల్లోనూ ఈ విషయాన్ని మంత్రులు లేవనెత్తారు. శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మరోసారి రాష్ట్రం తరఫున గట్టిగా వాదనలు వినిపించారు. మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ - సాగునీటి ప్రాజెక్టులు - గృహ నిర్మాణం - రహదారుల నిర్మాణంలాంటి కార్యక్రమాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అయినా ఆశించిన ఫలితం రాలేదు. ఏదో దయతలిచినట్టు.. 18% పన్ను రేటును 12శాతానికి తగ్గిస్తున్నట్టు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించడంపై సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఈ ఏడాది జూలై 1వ తేదీకి ముందు ప్రారంభించిన ప్రాజెక్టులకూ జీఎస్టీ అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.19,200 కోట్ల మేరకు అదనపు భారం పడుతున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి మాత్రమే కాకుండా అన్ని రాష్ర్టాలకూ అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీనిని జాతీయ సమస్యగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. జీఎస్టీ అమలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష విధానానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని సీఎం నిర్ణయించారు.

రాష్ట్రప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని బట్టి వార్షిక బడ్జెట్‌ లో కేటాయింపులు చేసిందని, ఇప్పుడు జీఎస్టీ ద్వారా పడే అదనపు భారంతో వాటిని నిర్దిష్ట లక్ష్యం మేరకు అమలు చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయం కావడం వల్ల అమలు కష్టమని అన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని బడ్జెట్‌ లో పొందుపర్చాల్సి ఉంటుందని, అది ఇప్పుడు సాధ్యం కాదని తెలిపారు. జీఎస్టీ వర్తింపు వల్ల ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరుగుతాయని, ఈ అదనపు భారాన్ని ఇప్పుడు బడ్జెట్‌ లో పొందుపర్చలేమని పేర్కొన్నారు. కాబట్టి కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డిమాండ్‌ ను లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుని జీఎస్టీ భారాన్ని తొలిగించడానికి బదులుగా ఏదో కనికరం చూపినట్లు ఆరు శాతం పన్నును తగ్గించడం కంటితుడుపు చర్యేనని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది ఈ దయాదాక్షిణ్యాలను - పన్నురేటును తగ్గించడాన్ని కాదు. ఆన్‌ గోయింగ్ ప్రాజెక్టులు కాబట్టి జీఎస్టీతో సంబంధం లేకుండా పాత పన్ను విధానాన్నే కొనసాగించాలన్నది తెలంగాణ డిమాండ్.

జీఎస్టీ ఊసే లేనప్పుడు ఈ ప్రాజెక్టులను రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకాలు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పుడు జీఎస్టీ పేరుతో అదనపు భారాన్ని వేయడమంటే ఆ పనులకు బ్రేకులు వేయడమే. ప్రజా సంక్షేమం - అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులను లబ్ధిదారులకు దక్కకుండా చేయడమేనని అధికారులు అంటున్నారు. వాస్తవానికి వన్ నేషన్ - వన్ ట్యాక్స్ అనే విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టి పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే అన్నింటికంటే ముందుగా అసెంబ్లీలో ఆమోదించింది తెలంగాణ ప్రభుత్వమే. కానీ ప్రజలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి అదనంగా భారం వేయడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.


మ‌రోవైపు కొనసాగుతున్న (ఆన్‌ గోయింగ్‌) ప్రాజెక్టులపై ఐదు శాతం పన్నునే అమలుచేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి కే తారక రామారావు చేసిన డిమాండ్‌ కు బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఛత్తీస్‌ గఢ్ - జార్ఖండ్ - గుజరాత్ - రాజస్థాన్‌ లతోపాటు పశ్చిమబెంగాల్ - పంజాబ్ తదితర రాష్ర్టాలు కూడా మద్దతు పలికాయి. బీజేపీ నేత - బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్ మోడీ సైతం కేటీఆర్ వాదనకు మద్దతు తెలిపారు. కేటీఆర్ డిమాండ్‌ పై ఆర్థికమంత్రి జైట్లీ మాట్లాడుతూ మిషన్ కాకతీయ - మిషన్ భగీరథ - సాగునీటి ప్రాజెక్టులు - రోడ్ల నిర్మాణం - డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్లు తదితర ప్రాజెక్టులపై జీఎస్టీ కౌన్సిల్ విధించిన 18% పన్నును 12శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. పాత ప్రాజెక్టులతోపాటు కొత్త ప్రాజెక్టులన్నింటికీ ఈ పన్ను రేటు వర్తిస్తుందని తెలిపారు. అయితే ఈ నిర్ణయంతో తాము సంతృప్తి చెందడంలేదని, ప్రస్తుతం అమలవుతున్న 5% పన్నునే కొనసాగించాలని కేటీఆర్ స్పష్టంచేశారు. తమ డిమాండ్ మేరకు 18% పన్నును 12శాతానికి తగ్గించడంతో ఒక మేరకు మాత్రమే ఉపశమనం కలుగుతుందన్నారు. కనుక అదనంగా పడిన భారం మొత్తాన్ని తొలిగించాల్సిందేనని కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.