Begin typing your search above and press return to search.

కేంద్రానికి కేసీఆర్ గాలం

By:  Tupaki Desk   |   9 Dec 2015 7:53 AM GMT
కేంద్రానికి కేసీఆర్ గాలం
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కే చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రోమారు త‌న‌దైన రాజ‌కీయ చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుత‌ - భ‌విష్య‌త్ అవ‌స‌రాలు దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పెద్ద‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న అవ‌స‌రాల‌కు ప‌నికి వ‌చ్చే వారంద‌రినీ ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో కేసీఆర్ బిజీబిజీగా ఉన్నార‌ని ప్ర‌స్తుత ప‌రిణామాలు తేల్చిచెపుతున్నాయి.

రెండ్రోజుల ప‌ర్య‌ట‌న‌కోసం మంగ‌ళ‌వారం సాయంత్ర‌మే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ‌ సాయంత్రం జ‌ర‌గ‌నున్న‌ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తె వివాహ‌ విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. గురువారం సాయంత్రం విజ్ఞాన్‌ భవన్‌ లో జరిగే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ 75వ జన్మదిన వేడుకలకు కూడా హాజరవుతారు. ఈ రెండు వేడుక‌లు కూడా కేవ‌లం అభినంద‌న పూర్వ‌క‌మైన‌వో లేదా ఆత్మీయ‌ప‌ర‌మైన‌వో కావ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంచ‌నావేస్తున్నాయి. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ కేబినెట్‌ లో అరుణ్ జైట్లీది నంబ‌ర్‌2 ర్యాంక్‌. పైగా కీల‌క‌మైన ఆర్థిక శాఖ‌. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక అవ‌స‌రాలు, కేటాయింపులు అన్నీ మంత్రి చేతుల్లోనే ఉంటాయి కాబ‌ట్టి ఆయ‌న్ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డంలో భాగంగా కేసీఆర్ ఢిల్లీకి ప‌యన‌మ‌య్యారు. పైగా పొరుగు రాష్ర్ట సీఎం చంద్ర‌బాబు వెళ్లి త‌ను వెళ్ల‌క‌పోతే అస్స‌లు బాగోదు కాబ‌ట్టి కేసీఆర్ ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యార‌ని చెప్తున్నారు.

దీంతో పాటు ఎన్సీపీ అధినేత విందుకు సైతం రాజ‌కీయ‌కార‌ణాలే ఉన్నాయ‌ట‌. మ‌హారాష్ర్ట తెలంగాణకు పొరుగు రాష్ర్టం అనే సంగ‌తి తెలిసిందే. కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన కేటాయింపులనే ప్రస్తుతం తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు పంచుకోవాలే తప్ప మహారాష్ట్ర - కర్నాటక రాష్ర్టాలకు జరిగిన కేటాయింపులకు ఇబ్బంది కలిగించరాదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన నేపథ్యంలో మ‌హారాష్ర్టలో కీల‌క నేత అయిన ప‌వార్‌ తో స‌ఖ్య‌త కేసీఆర్‌ కు అత్య‌వ‌స‌రం. అంతేకాకుండా తెలంగాణ‌లో నిర్మించే భారీ ప్రాజెక్టుల‌న్నింటికీ ఏదే రూపేణా మ‌హారాష్ర్ట అనుమ‌తులు, అంగీకారం అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ర్ట అధికార ప‌క్షంలో భాగ‌స్వామ్యం పంచుకుంటున్న ఎన్సీపీతో మైత్రి మంచిద‌ని కేసీఆర్ ఈ వేడుక‌కు కూడా హాజ‌రుఅవుతున్నారు. పైగా ఢిల్లీ వేదిక‌గా జ‌రిగే ఏ ప‌రిణామాల్లో అయినా ప‌వార్ పాత్ర కీల‌క‌మైన‌దనే సంగ‌తి తెలిసిందే.

మొత్తంగా ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను బేరీజు వేసుకునే కేసీఆర్ రెండ్రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నార‌ని చెప్తున్నారు. మ‌రే ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వ‌డం లేదా అధికారిక కార్య‌క‌లాపాలు కానీ లేకుండా రెండ్రోజుల పాటు ఢిల్లీలో ఉండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఉద‌హ‌రిస్తున్నారు.