Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీ టూర్ అందుకేనా?

By:  Tupaki Desk   |   3 Aug 2018 4:35 AM GMT
కేసీఆర్ ఢిల్లీ టూర్ అందుకేనా?
X
ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యాలు తీసుకోవటం తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు అల‌వాటే. ఆయ‌న ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో ఒక ప‌ట్టాన అర్థం కాదు. తన ఢిల్లీ టూర్ గురించి క‌నీసం రెండు వారాల ముందే చెప్పే అల‌వాటున్న కేసీఆర్‌..ఈసారి అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు.

రెండు.. మూడు రోజుల ఢిల్లీ టూర్ గురించి చెప్ప‌ట‌మే కాదు.. తాజాగా త‌న షెడ్యూల్ ను వెల్ల‌డించారు. ప్ర‌త్యేక‌క విమానంలో బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్ల‌నున్న కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీతో పాటు.. ప‌లువురు కేంద్ర‌మంత్రుల్ని క‌ల‌వ‌నున్నారు. గ‌తంలో ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం కేసీఆర్ కిందా మీదా ప‌డాల్సి వ‌చ్చేది.

రెండుమూడు సార్లు అయితే.. ఢిల్లీకి వెళ్లి.. మోడీ అపాయింట్ మెంట్ దొర‌క్క వెన‌క్కి వ‌చ్చేయ‌టం తెలిసిందే. అలాంటి కేసీఆర్‌ కు.. తాజాగా మోడీ అపాయింట్ మెంట్ ఎప్పుడు ఫిక్స్ అయ్యిందో ఎవ‌రికీ అర్థం కానిది. ఇంత హ‌టాత్తుగా కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక మ‌త‌ల‌బు ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక ఉన్న ఎజెండా మీద చెబుతున్న అంశాలేవీ న‌మ్మ‌శ‌క్యంగా ఉండ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన‌ కొత్త జోన‌ల్ విధానానికి ఆమోదం పొంద‌టం..గిరిజ‌న‌.. ముస్లిం రిజ‌ర్వేష‌న్ల పెంపు.. ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న స‌హా కేంద్రం ఇచ్చిన ఇత‌ర హామీలు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల్ని ప్ర‌ధానితో చ‌ర్చిస్తార‌ని చెబుతున్నారు.

ఏపీకి ఇవ్వాలంటున్న ప్ర‌త్యేక హోదా అంశం మీదా మోడీతో చ‌ర్చిస్తార‌ని చెబుతున్నారు. విభ‌జ‌న సంద‌ర్భంగా తెలంగాణకు హామీ ఇచ్చిన కాజీపేట రైల్వే కోచ్ ప‌రిశ్ర‌మ‌.. గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం.. తొమ్మిది.. ప‌దో షెడ్యూల్ సంస్థ‌ల విభ‌జ‌న లాంటి అంశాల్ని కూడా చర్చిస్తార‌ని చెబుతున్నారు. అయితే.. ప్ర‌ధాన మీడియాలో చెబుతున్న మాట‌ల‌కు.. ఇప్పుడు జ‌రుగుతున్న దానికి ఏ మాత్రం సంబంధం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

దీనికి నిద‌ర్శ‌నంగా.. ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. తాజా ఢిల్లీ టూర్ ప్ర‌క‌టించ‌టానికి ముందు.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌ఫ‌ద‌ఫాలుగా గంట‌ల కొద్దీ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం.. దానికి సంబంధించిన విష‌యాలేవీ బ‌య‌ట‌కు రాక‌పోవ‌టాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. బ‌య‌ట‌కు చెబుతున్న ఎజెండాకు భిన్న‌మైనదేదో ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.