Begin typing your search above and press return to search.

మేడారం జాతరకు ఉమ్మడి రాష్ట్ర సీఎం డుమ్మా కొడితే కేసీఆర్ ఏమనేవారు?

By:  Tupaki Desk   |   21 Feb 2022 3:34 AM GMT
మేడారం జాతరకు ఉమ్మడి రాష్ట్ర సీఎం డుమ్మా కొడితే కేసీఆర్ ఏమనేవారు?
X
నిజానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్నన్ని అడ్వాంటేజీలు మరెవరికి ఉండవేమో? తాను వేలెత్తి చూపించి.. మాటలతో ఉతికి పారేసిన అంశాల విషయంలో తాను వ్యవహరించే ధోరణి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వెసులుబాటు ఆయనకు మాత్రమే ఉంటుందేమో? తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే ఈ గిరిజన పండక్కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దాదాపు కోటి మందికి పైనే ప్రజలు ఈ జాతరకు వెళ్లి రావటం కనిపిస్తుంటుంది. దేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక భక్తులు హాజరయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమం ఇదేనని చెప్పాలి.

తెలంగాణ ప్రజలు ఎంతగానో ఇష్టపడే ఈ జాతరకు హాజరయ్యేందుకు వారు తీసుకునే శ్రమ.. వ్యయప్రయాసలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వం సైతం ఈ జాతర కోసం ముందు నుంచే పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని చేపట్టటంతో పాటు.. భారీగా ఏర్పాట్లు చేస్తుంది. వందల కోట్ల రూపాయిల ఖర్చును చేస్తుంటారు. ఇలాంటి ఈ జాతరను ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారు. తెలంగాణ ఆత్మగౌరవం మొదలు తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పటమే కాదు.. గంటల కొద్దీ మాట్లాడి కోట్లాది మంది ప్రజల గుండెల్ని టచ్ చేసే గులాబీ బాస్ కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక విషయంలో మెచ్చుకోవాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఉమ్మడి పాలకుల వివక్ష.. పక్షపాతం.. చిన్నచూపు చూడటం లాంటి మాటలు చెప్పి భావోద్వేగాల్ని రగిలించటమే కాదు.. ఉమ్మడి పాలకులు కాబట్టే ఇలా చేశారు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. మనోడే ముఖ్యమంత్రి అయి ఉంటే మరెంత ధూంధాంగా నిర్వహించుకునేవాళ్లం.

అందుకే కదా.. సొంత రాష్ట్రం కావాలని కోరుకునేది. ఈ సమైక్య పాలకులకు ఎంత చిన్నచూపు? మరెంత అహంకారం? మన మీదా.. మన సంస్కృతి మీద వారికున్న చులకన భావం మీకు కనిపించటం లేదా? లాంటి మాటలు తరచూ చెప్పిన నాటి ఉద్యమ నేత.. ఇప్పటి పరిపూర్ణ రాజకీయ నేతగా మారిన కేసీఆర్.. తాను సీఎంగా ఉండి మేడారం జాతరకు హాజరు కాకపోవటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి?

తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని గవర్నర్ తమిళ సై సైతం.. మేడారం జాతరకు వెళ్లి.. అక్కడి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారు. తెలంగాణ కోసం కోట్లాడి.. ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమైన కేసీఆర్ కు మాత్రం.. రెండేళ్లకు ఒకసారి వచ్చే మేడారం జాతరకు వెళ్లేంత తీరిక దొరక్కపోవటం ఏమిటి? తన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసేసిన ఆయన.. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు ఫోకస్ చేయటం.. అందులో భాగంగా కొత్త జట్టు కట్టేందుకు వీలుగా పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లే టైం ఉన్న ఆయన.. తెలంగాణ కుంభమేళాకు హాజరయ్యే సమయం లేదా? అన్నది క్వశ్చన్.

ఒకవేళ.. ఇలాంటి తీరునే ఉమ్మడి పాలకులు చేసి ఉంటే.. ఇదే కేసీఆర్ ఏమనేవారు. ఎన్నేసి మాటలు అనేవారు? ఉమ్మడి రాష్ట్ర సీఎం మేడారం జాతరకు హాజరు కాకుంటే వివక్ష.. చులకన.. అహంకారంగా కనిపించినప్పుడు.. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యక్తి.. తెలంగాణ కుంభమేళకు హాజరుకాకపోవటం దేనికి నిదర్శనం? ఇదంతా చూసినప్పుడు కేసీఆర్ కున్న అడ్వాంటేజ్ మరెవరికీ ఉండదనటంలో సందేహం లేదు. కాదంటారా?