Begin typing your search above and press return to search.

ఆగమ్మ దగ్గర టమోటా కూర తినుడు.. రాధమ్మ వద్ద టీ తాగుడు అయ్యేనా సారూ?

By:  Tupaki Desk   |   21 Aug 2021 4:30 AM GMT
ఆగమ్మ దగ్గర టమోటా కూర తినుడు.. రాధమ్మ వద్ద టీ తాగుడు అయ్యేనా సారూ?
X
మాటలతో మనసుల్ని గెలుచుకునే కేసీఆర్ ఇటీవల కాలంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? అంటే అవునంటున్నారు. దీనికి కారణం.. రాజకీయ నేత ప్రజలకు ఇచ్చే హామీల్ని అమలు చేయకున్నా పెద్దగా పట్టించుకోరు. దశాబ్దాల కాలంగా పార్టీలు.. రాజకీయ నేతలు హామీలు ఇచ్చుడు.. దాన్ని తీర్చుడన్న ముచ్చటే లేనప్పుడు.. ప్రత్యేకించి నమ్మకాలేముంటయ్? కానీ..పెద్ద పెద్ద స్థానాల్లో ఉండే ప్రముఖులు సాదాసీదా వారికి తమ వ్యక్తిగతంగా ఇచ్చే హామీల్ని సదరు వ్యక్తి మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఉన్నోళ్లు.. ఊరోళ్లు.. సోషల్ మీడియాలో రాసేటోళ్లు మాత్రం అదే పనిగా గుర్తు పెట్టేసుకుంటారు. ఇలాంటి వారెప్పుడు అప్పులోళ్ల మాదిరి.. నేతలు ఇచ్చిన హామీల అమలు మాటేమిటన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు.

అలాంటి విషయాల్లోనే అడ్డంగా దొరికిపోతున్నారు కేసీఆర్.. రూ.1.5లక్షల కోట్లు పెట్టైనా సరే.. దళితబంధు పథకాన్ని అమలు చేయటానికైనా వెనుకాడని పెద్ద మనిషి.. గతంలో గొర్రెల్ని పంపకం షురూ చేసినంతనే.. తెలంగాణ వ్యాప్తంగా గొర్రెలతో కళకళలాడిపోవటమే కాదు.. వేలాది కోట్ల రూపాయిలు ఉత్త గొర్రెల యాపారంతోనే వచ్చేస్తాయని.. తెలంగాణ సంపన్న తెలంగాణ మారిపోతాయని చెప్పటం తెలిసిందే. కేసీఆర్ తన మాటలతో అటు గొర్రెల్ని పెంచేటోళ్లనే కాదు.. తన మాటల్ని నమ్మే ప్రజల్ని నమ్మించారు. ఏళ్లకు ఏళ్లు గడిచాయి.

వందలాది కోట్లు ఈ పథకం కోసం ఖర్చు పెట్టారు. గొర్రెలు సాకేటోడు బతుకులు మారిపోతాయని.. బంగారు తెలంగాణలో మొదటి సంపన్నులు వారే అన్నట్లుగా గొప్పగా ప్రచారం చేశారు. మరేమైంది? ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా గొర్రెల సంఖ్యలో తేడా వచ్చిందే తప్పించి.. కేసీఆర్ చెప్పినట్లుగా యావత్ తెలంగాణ రూపు రేఖలే కాదు.. కనీసం వారి బతుకులు కూడా పెద్దగా మారని పరిస్తితి.

అంతేకాదు.. వారికో స్థిరమైన గూడు.. వారి పిల్లలు బాగా చదువుకునేట్లుగా మాంచి ఇస్కూలు లాంటివి ఇప్పటికి చాలామందికి లేవు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బుల్ని పప్పుబెల్లాల మాదిరి పంచితే ఫలితం ఉండదన్న చిన్న విషయం మేధావి కేసీఆర్ కు ఎందుకు అర్థం కాదో తెల్వదు. ఉపాధి కల్పించి.. వారిని సంపాదించేలా చేయటం ద్వారా.. చాలా వరకు వారి జీవితాలు మెరుగవుతాయి. అంతే తప్పించి బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు వేసేసినంత మాత్రాన సంపన్నులు అయిపోతారని.. వారి జీవితాలు బ్రహ్మండంగా మారతాయని అనుకోవటం భ్రమే అవుతుంది.

అందుకే ఉపాధి.. వ్యాపార అవకాశాలు కల్పిస్తే.. పేదవారు కష్టపడి పని చేయటం.. దాని ద్వారా తనకు వచ్చే ప్రయోజనాలు వారే పొందే వీలుండాలన్నది మర్చిపోకూడదు. ఇదంతా ఎందుకంటే.. ఉత్తినే ఖాతాలో డబ్బులు వేయటం.. దాన్ని ప్రభుత్వ పథకం పేరు చెప్పి అమలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం కాస్తైనా ఉందంటే సరే ఫర్లేదు. అందుకు భిన్నంగా ఖర్చు అయితే పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న. ఇప్పుడు ఇచ్చినట్లే.. మరోసారి ఇవ్వాల్సి వస్తే.. అప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదన్న విషయాన్ని అర్థమయ్యే అవకాశం ఉంది. దళిత బంధు విషయాన్ని పక్కన పెడితే.. గతానికి భిన్నంగా ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారన్నది ప్రశ్నగా మారింది.

అభిమానాన్ని డబ్బుతో కొలవకూడదని చెబుతారు. అందుకు తగ్గేట్లే సీఎం కేసీఆర ఇచ్చిన పథకాల్ని మర్చిపోదాం. వ్యక్తిగతంగా ఆయన ఇచ్చిన హామీల్నినెరవేర్చుతున్నారా? అన్నది చూస్తే.. వాసాలమర్రిలో పెద్ద సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా.. ఆగమ్మ అనే పెద్ద వయస్కురాలి ఇంటికి వెళ్లి మరీ ఇవాళ ఏం వండుకున్నావని అడగటం.. అందుకు అవ్వ బదులిస్తూ టమోటా కూరు వండినట్లు చెప్పింది. సర్పంచ్ ఇంటి దగ్గరకు వచ్చేయ్.. అక్కడ తిందామంటూ బదులిచ్చిన సీఎం కేసీఆర్.. ఆగమ్మ కూర తిన్నది లేదనే తెలిసిందే. అక్కడ ఆ చిన్న విషయాన్ని పెండింగ్ లో ఉంచేశారు కేసీఆర్. మీడియాలో రావటం కోసమో.. చుట్టూ ఉన్న వారి మెప్పుకోసమో ఆయన నోటి నుంచి అలాంటి మాటలు వస్తాయని చెబుతారు.

తాజాగా దళితబంధు పథకాన్ని అమలు చేయటానికి వీలుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాధమ్మ అనే మహిళకు మిగిలిన లబ్థిదారులకు ఇచ్చినట్లే రూ.10 లక్షలు ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఇప్పుడిచ్చిన సొమ్ముతో ఏం చేస్తావ్ అని అడిగినప్పుడు పాల డెయిరీ పెట్టుకుంటానని చెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా ఎప్పటిలానే సీఎం కేసీఆర్ ఒక వ్యాఖ్య చేస్తూ.. ‘‘ఈసారి వచ్చినప్పుడు నీ కాడకొచ్చి టీ తాగుతా.. ఇస్తావా? అంటూ సరదాగా అడిగేశారు. తనకు అలవాటైన మాటలతో అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ గా చెప్పేసినా.. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగతంగా చేసే వ్యాఖ్యల్ని మాత్రం ప్రజలంతా గుర్తు పెట్టుకుంటారన్న విషయాన్ని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాట వరుసకు చెప్పిన మాటలు అప్పటికి బాగానే ఉన్నా.. తర్వాతి రోజుల్లో మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయన్నది మర్చిపోకూడదు.