Begin typing your search above and press return to search.

ఇంట‌ర్ ఫ‌లితాలు..కేసీఆర్ కీల‌క‌ నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   24 April 2019 8:12 AM GMT
ఇంట‌ర్ ఫ‌లితాలు..కేసీఆర్ కీల‌క‌ నిర్ణ‌యం
X
ఇంటర్ పరీక్షా ఫలితాల విషయంలో నెల‌కొన్న గంద‌ర‌గోళం - రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న నేప‌థ్యంలో...ముఖ్య‌మంత్రి కేసీఆర్ అల‌ర్ట్ అయ్యారు. ఫ‌లితాల వ‌ల్ల ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డే పరిస్థితి ఎదుర‌వుతుండ‌టంతో...ఆయ‌న స్వ‌యంగా రంగంలోకి దిగి విద్యాశాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో చ‌ర్చించారు. ఇంటర్ ఫలితాలపై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ త్రిసభ్య కమిటీ వేగవంతంగా పనిచేయించాల‌ని ఆదేశాలు ఇచ్చారు. క‌మిటీ నివేదిక వ‌చ్చిన అనంత‌రం త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు త్రిస‌భ్య క‌మిటీ విచార‌ణ కొన‌సాగుతోంది.

సీఎం కేసీఆర్ ఆర్డ‌ర్ నేప‌థ్యంలో మంత్రి జ‌గ‌దీశ్‌ రెడ్డి స్పందించారు. ఇంట‌ర్ గంద‌ర‌గోళానికి బాధ్యులెవరో గుర్తించి కఠినంగా శిక్షించేందుకు టీఎస్‌ టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేశామన్నారు. క‌మిటీ నివేదిక రూపొందిస్తోందని - నివేదిక అందగానే సాంకేతిక లోపమైతే ఆ సంస్థ పైన - మానవ తప్పిదమైతే సంబంధిత అధికారులపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానం ఉన్న వారు రీవాల్యుయేషన్‌ కు దరఖాస్తు చేసుకొని సమస్య పరిష్కరించుకోవాలి తప్ప అపోహలకు పోయి తమ విలువైన జీవితాలను వృథా చేసుకోవద్దని సూచించారు.

కాగా, త్రిస‌భ్య కమిటీ చైర్మన్ టీఎస్‌ టీఎస్ ఎండీ - జీటీ వెంకటేశ్వర్‌ రావు కమిటీ సోమ - మంగ‌ళ వారాల్లో స‌మావేశం అయింది. ఈ క‌మిటీ ముందు గ్లోబ‌రీనా ఎండీ హాజ‌ర‌య్యారు. ``బోర్డ్ అవసరాలకు అనుగుణంగా గ్లోబరీనా సంస్థ పనిచేసిందా? ఫలితాల్లో తప్పులు జరుగకుండా వ్యవహరించిందా? సాంకేతిక తప్పిదం ఏమైనా ఉన్నదా? అనే అంశాలపై వివరణ కోరిన‌ట్లు తెలుస్తోంది. బుధ‌వారం నాటికి క‌మిటీ ప‌రిశీల‌న ప్ర‌క్రియ ముగియ‌నుంది. నిర్దేశించిన గడువులోగా నివేదిక ఇవ్వనున్నట్లు చైర్మ‌న్ మీడియాతో తెలిపారు.

మ‌రోవైపు గ్లోబ‌రీనా ఎండీపై త్రిస‌భ్య క‌మిటీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్లు స‌మాచారం .``సాంకేతిక సేవలు నిబంధనల ప్రకారం అందించారా? ఫలితాల వెల్లడి ప్రక్రియలో సాంకేతిక సంబంధమైన తప్పిదాలు దొర్లాయా? ఇంటర్ బోర్డ్ రూపొందించిన నిబంధనల ప్రకారం సాఫ్ట్‌వేర్ పనితీరు ఉందా? సేవలు అందించేందుకు తగు ఉద్యోగులు ఉన్నారా? ఒకవేళ తప్పిదాలు దొర్లితే గుర్తించి - పరిష్కారం చూపించే ప్ర‌య‌త్నం చేశారా? `` అంటూ ప్ర‌శ్న‌లు గుప్పించిన‌ట్లు స‌మాచారం.