Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీ లాబీయింగ్‌ లో ఇది మ‌రొక‌టి

By:  Tupaki Desk   |   20 Jun 2018 5:28 AM GMT
కేసీఆర్ ఢిల్లీ లాబీయింగ్‌ లో ఇది మ‌రొక‌టి
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో దాదాపు గంట‌పాటు సాగిన ప్ర‌త్యేక మంత‌నాలకు చెందిన స‌మాచారం ఒక్కొక్క‌టిగా...ఒకింత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. గ‌తంలో కేసీఆర్ భేటీ వెంట‌నే చ‌ర్చ‌ల స‌మాహారం తెర‌మీద‌కు రాగా - ఈ ద‌ఫా అందుకు భిన్నంగా కాస్త గ్యాప్ త‌ర్వాత ఆ చ‌ర్చ‌ల వివ‌రాలు తెలుస్తున్నాయి. తాజాగా ఈ సిరీస్‌ లో మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌ను మార్చే కీల‌క ప్రాజెక్టు అయిన ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియ‌న్ (ఐటీఐఆర్‌) విష‌యంలో కేసీఆర్ గ‌ట్టి లాబీయింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఏకంగా కేంద్ర‌మంత్రిపై కేసీఆర్ ఫిర్యాదు చేయ‌గా...దానికి ప్ర‌ధాని త‌క్ష‌ణం రియాక్ట్ అయ్యార‌ని అంటున్నారు.

వివ‌రాల్లోకి వెళితే...ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన సందర్భంగా.. హైదరాబాద్‌ లో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారని సమాచారం. హైదరాబాద్‌ లో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటుచేస్తామని తెలంగాణ ఆవిర్భావానికి ముందు కేంద్రం ప్రకటించిందని - ఈ మేరకు ఆనాటి మంత్రివర్గ సమావేశం విధానపరమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నదని అయితే.. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు ముగిసిన శకం అని ప్రకటించారని, ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని కేసీఆర్ ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి చేసిన ప్రకటన సరికాదని ప్రధానమంత్రితో కేసీఆర్‌ చెప్పినట్టు తెలిసింది. ఇది విన్న ప్రధాని నరేంద్రమోడీ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేసి ఐటీఐఆర్‌ ను వెన‌క్కు తీసుకోలేద‌ని తెలిపిన‌ట్లు సమాచారం.

క్యాబినెట్ నిర్ణయాన్ని ఏకపక్షంగా రద్దుచేయడం సరైందని కాదని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ప్రధాని ఏకీభ‌వించార‌ని స‌మాచారం. స‌మావేశం జ‌రుగుతుండ‌గానే ఐటీశాఖ కార్యాలయానికి ఫోన్‌చేసి.. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు అమలులో ఏమైనా విధానపరమైన ఇబ్బందులుంటే నిబంధనలు మార్చండి కానీ ప్రాజెక్టును రద్దు చేయవద్దని ఆదేశించారని విశ్వసనీయవర్గాల సమాచారం. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేసే అధికారం తిరిగి క్యాబినెట్‌ కు మాత్రమే ఉంటుందని ప్రధాని అధికారులకు స్పష్టం చేశారని తెలిసింది.