Begin typing your search above and press return to search.

భ‌విష్య‌త్‌ కు కేరాఫ్ అడ్ర‌స్ గా..06-09-2018

By:  Tupaki Desk   |   6 Sep 2018 8:57 AM GMT
భ‌విష్య‌త్‌ కు కేరాఫ్ అడ్ర‌స్ గా..06-09-2018
X
అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు అంతా త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌ట్లే అనిపిస్తూ ఉంటుంది. ఆ మ‌త్తులో నిర్ణ‌యాలు తీసుకుంటే త‌ప్పులో కాలు ప‌డిపోవ‌టం ఖాయం. అయితే.. అలాంటి వాటికి తాను చాలా దూర‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పెను జూదానికి తెర తీశారు. సాంకేతికంగా చేయించిన స‌ర్వేలు.. జాత‌క రీత్యా గ్ర‌హ‌బ‌లం త‌న‌కు అండ‌గా ఉంద‌న్న ధీమాతోపాటు.. తెలంగాణ స‌మాజం త‌న మాట‌కు ఇంకా విలువను ఇస్తుంద‌ని.. తన మాట‌కు త‌గ్గ‌ట్లుగా స్పందిస్తార‌న్న న‌మ్మ‌కం క‌లగ‌లిపి.. మొత్తంగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

సాంకేతికంగా చూస్తే.. మ‌రో తొమ్మిది నెల‌ల పాటు అధికారం చేతిలో ఉండే అవకాశం ఉన్న‌ప్ప‌టికీ.. ముంద‌స్తుతో మ‌రోసారి అధికారాన్ని ఈజీగా వ‌చ్చేయొచ్చ‌న్న అంచ‌నాలు కేసీఆర్ చేత కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి కార‌ణ‌మైంద‌ని చెప్పాలి. రానున్న రోజుల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరిగే వీలుండ‌టం.. త‌న‌కు సానుకూలంగా ఉన్న వేళ‌లోనే అసెంబ్లీని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకొని.. ఆ ఊపులోనే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం ద్వారా అంతా తాను రాసుకున్న స్క్రీన్ ప్లే ప్ర‌కార‌మే సాగుతుంద‌న్న న‌మ్మ‌కం కేసీఆర్ లో మెండుగా ఉంది.

ప్ర‌జ‌ల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి.. ఆగ్ర‌హాం త‌న‌కున్న అధికారంతో బ‌య‌ట‌కు రాకుండా చేసిన కేసీఆర్‌.. ప‌వ‌ర్ లేని వేళ‌.. ఆ గొంతుక‌ల‌ను ఎలా కంట్రోల్ చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న‌కు వ్య‌తిరేకంగా నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు మొహ‌మాటం లేకుండా అనుమ‌తులు ఇవ్వ‌ని కేసీఆర్ స‌ర్కారు.. ఆందోళ‌న‌ల్ని.. నిర‌స‌న‌ల్ని అధికారుల సాయంతో బ‌య‌ట‌కు రాకుండా చేసిన కేసీఆర్ కు రానున్న రోజుల్లో అలాంటి ప‌రిస్థితి ఉందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారుతోంది.

అన్నింటికి మించి.. ఇంత‌కాలం తన‌కు త‌గ్గట్లుగా బ‌ల‌మైన మీడియా లాబీని ఏర్ప‌ర్చుకున్న కేసీఆర్‌.. అసెంబ్లీ ర‌ద్దు త‌ర్వాత కూడా ఆ మేజిక్ ను ఆయ‌న కంటిన్యూ చేయ‌గ‌ల‌రా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇలా చాలానే స‌వాళ్లు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న మాత్రం మ‌రో ఆలోచ‌న లేకుండా అసెంబ్లీని ర‌ద్దు చేసేందుకు డిసైడ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్ప‌డిన మొద‌టి ప్ర‌భుత్వం.. ప్ర‌భుత్వాధినేత ఆశ‌తో.. రాజ‌కీయ లాభాపేక్ష‌తో గ‌డువుకు తొమ్మిది నెల‌ల ముందే అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌న్న నిర్ణ‌యానికి నిలువెత్తు రూపంగా ఈ రోజు (06-09-2018) నిలుస్తుంద‌న‌టంలో సందేహం లేదు. భ‌విష్య‌త్తులో తెలంగాణ రాజకీయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా.. ఈ రోజు ప్ర‌భావం ఎంతో కొంత ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.