Begin typing your search above and press return to search.

గెలుపు ధీమా ఉంటే 14 స‌ర్వేలు ఎందుకంట‌?

By:  Tupaki Desk   |   27 Aug 2018 4:09 AM GMT
గెలుపు ధీమా ఉంటే 14 స‌ర్వేలు ఎందుకంట‌?
X
ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. త‌మ‌కు గెలుపు విష‌యంలో ఎలాంటి ఢోకా లేద‌న్న‌ట్లుగా మాట‌లు చెబుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆయ‌న చెప్పే మాట‌ల ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగితే వంద‌కు పైగా సీట్లు ప‌క్కా అన్న మాట ఆయ‌న నోట ప‌దే ప‌దే వినిపిస్తూ ఉంటుంది.

తానేదో మాట వ‌ర‌స‌కు వంద‌కు పైగా సీట్లు అని చెప్ప‌టం లేద‌ని.. ఇప్ప‌టికి తాను 14 స‌ర్వేలు చేయించాన‌ని.. ఆ స‌ర్వేల సారాంశం వంద‌కు పైగా సీట్లు కారు ఖాతాలో ప‌డ‌టంగా చెబుతారు. కేసీఆర్ చెప్పే వంద సీట్ల మాట‌లో క‌నిపించ‌ని లాక్కులు కొన్ని ఆస‌క్తిక‌రంగా మారాయి.

కేసీఆర్ చెప్పిన‌ట్లుగా త‌మ పార్టీ నేత‌లు భారీ మెజార్టీతో గెలుస్తార‌న్న ధీమా ఉన్న‌ప్పుడు ఒకట్రెండు.. లేదంటే నాలుగైదు స‌ర్వేలు స‌రిపోతాయి క‌దా? మ‌రి.. ప‌ద్నాలుగు స‌ర్వేలు ఎందుకు చేయించిన‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దానికి ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

తాను స‌ర్వేలు చేయించిన‌ట్లు చెప్పారే కానీ.. ఎప్పుడూ స‌ర్వే ఫ‌లితాల్ని వెల్ల‌డించ‌క‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఒక‌వేళ త‌మ‌కంత ధీమా ఉన్న‌ప్పుడు ప్ర‌తికూలంగా ఉన్న స్థానాల్ని మాట వ‌ర‌స‌కు కూడా ఎందుకు చెప్ప‌న‌ట్లు? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. తెలంగాణ‌లో మొత్తం 119 స్థానాలు ఉంటే.. అందులో ఏడు స్థానాలు కేసీఆర్ మిత్రుడు మ‌జ్లిస్ కు చెందిన‌విగా చెప్పాలి. వాటిని మిన‌హాయించుకుంటే 112 స్థానాలు మిగులుతాయి. అందులో వంద‌కు పైనే స్థానాలు గులాబీ ఖాతాలో ప‌డ‌తాయ‌న్న‌ది కేసీఆర్ మాట‌.

ప‌రిస్థితి తన‌కు సానుకూలంగా ఉంద‌న్న మాట కొన్నేళ్లుగా కేసీఆర్ నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. వేరే పార్టీల నుంచి తీసుకొచ్చిన నేత‌ల విష‌యంలో ఉప ఎన్నిక‌ల‌కు ఎందుకు వెళ్ల‌లేద‌న్న మాట కూడా వినిపిస్తూనే ఉంటుంది. నిత్యం విలువ‌ల గురించి మాట్లాడే కేసీఆర్‌.. త‌న పార్టీలోకి వేరే పార్టీ టికెట్ల మీద గెలిచిన ఎమ్మెల్యేల్ని తీసుకున్న‌ప్పుడు.. వారి చేత రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నిక‌ల‌కు ఎందుకు వెళ్లలేద‌న్న మాట‌కు స‌మాధానం రాని ప‌రిస్థితి. ఈ రోజున ప‌రిస్థితి త‌మ‌కు అనుకూలంగా ఉంద‌ని కేసీఆర్ సంబ‌ర‌ప‌డుతూ ఉండొచ్చు కానీ.. త‌న‌కు ప్ర‌తికూలంగా ఉండే రోజుల్లో.. ఈ త‌ప్పుల‌న్నింటికి కేసీఆర్ కానీ.. ఆయ‌న రాజ‌కీయ వార‌సులు స‌మాధానాన్ని చెప్పాల్సిన ప‌రిస్థితి ఎదురు కావ‌టం ఖాయం. ఆ రోజున‌.. ఇప్పుడు చేసిన ప‌నుల‌న్ని వెంటాడ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.