Begin typing your search above and press return to search.

కారు రివర్స్.. అంతర్మథనంలో కేసీఆర్

By:  Tupaki Desk   |   8 Oct 2018 7:55 AM GMT
కారు రివర్స్.. అంతర్మథనంలో కేసీఆర్
X
తనపై తనకు అపారమైన విశ్వాసం.. తెలంగాణ దశను మార్చిన సంక్షేమ పథకాలపై అపార నమ్మకం.. దేశం గర్వించే సంక్షేమపథకాలు తనను గట్టెక్కిస్తాయని అనుకున్నాడు.. కానీ కేసీఆర్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా.? క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులకు నిరసనల సెగ టీఆర్ ఎస్ పుట్టి ముంచుతోందా.? పనులు చేయని.. నిర్లక్ష్య టీఆర్ ఎస్ అభ్యర్థులకు తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ గులాబీ బాస్ లో అంతర్మథనం మొదలైనట్టు సమాచారం.

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి 105మంది అభ్యర్థులను ప్రకటించేసిన కేసీఆర్ తనపైన, తన పాలనపైనా ధీమా వ్యక్తం చేశాడు. తన బొమ్మ చూసి ఓటేస్తారని నమ్మాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిగిరినట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు అదేనని అర్థమవుతోంది.

కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థుల్లో కనీసం 30 నుంచి 40 మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వారు వద్దంటూ ప్రజలు ఇప్పుడు రోడ్ల మీదకు వస్తున్నారు. ఏకంగా ర్యాలీలు - సభలు నిర్వహిస్తూ టీఆర్ ఎస్ అభ్యర్థులను ఓడిస్తామని తేల్చిచెబుతున్నారు.

తాజాగా వరంగల్ పూర్వపు జిల్లాలోని వర్ధన్నపేట టీఆర్ ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు నిరసన సెగ తగిలింది. నాలుగున్నరేళ్లలో మా ఊరుకు ఏం చేశావంటూ బాలాజీ నగర్ వాసులు ఆయన్ను నిలదీశారు. అంతేకాదు ‘గోబ్యాక్’ అనే ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ పెద్దసంఖ్యలో ప్రదర్శనగా ర్యాలీ తీశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. . దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ ఆర్థాంతరంగా వెళ్లిపోయారు. ఇక పెద్దపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ ఎస్ నేత దాసరి మనోహర్ రెడ్డిని సైతం జూలపల్లి మండల వాసులు అడ్డుకున్నారు. అభివృద్ధి చేయలేదని అడ్డుకున్నారు. హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ ను ఏకంగా ఆయన జీపును ఆపి మరీ మీరు మా ఊరుకు ఏం చేయలేదంటూ తెనుగుపల్లి వాసులు నిలదీశారు. ఇక వేములవాడ టీఆర్ ఎస్ అభ్యర్థి రమేష్ బాబును వద్దంటూ అసమ్మతి వాదులు సభలు - సమావేశాలు - నిరసనలు చేస్తున్నారు. ఈయన్ను ఓడిస్తామని ప్రతిన బూనుతున్నారు. ఇక జనగాం - పాలకుర్తి - మానకొండూర్ - రామగుండం - ఆదిలాబాద్ - నిర్మల్ నియోజకవర్గాల్లోనూ టీఆర్ ఎస్ అభ్యర్థులను ఆయా గ్రామాల వాసులు నిలదీస్తున్నారు..

ఈ పరిణామాలు గులాబీ బాస్ లో అంతర్మథనానికి దారితీస్తున్నాయి. వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చకుండా పొరపాటు చేశామా అన్న ఆందోళన టీఆర్ ఎస్ ముఖ్యనాయకుల్లో వ్యక్తమవుతోందట.. కేసీఆర్ ను చూసి ఓటేస్తారనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతలు బయటపడి పార్టీ పుట్టిమునిగేలా కనిపిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. మరి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నేపథ్యంలో కేసీఆర్ వీరిని మారుస్తాడా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మార్చకపోతే ఓడిపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.. ఏం చేస్తాడనేది వేచి చూడాల్సిందే..