Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను భారీగా దెబ్బేసిన 'తెలుగు'

By:  Tupaki Desk   |   17 Dec 2017 4:20 AM GMT
కేసీఆర్‌ ను భారీగా దెబ్బేసిన తెలుగు
X
తిరుగులేని అధికారంతో దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల పేరుతో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మం ఎప్ప‌టి మాదిరే త‌న గ్రాఫ్ భారీగా పెరుగుతుంద‌ని బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే ప‌క్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు.

త‌న‌కు అనుకూల వాతావ‌ర‌ణం నెల‌కొన్న వేళ‌.. తెలంగాణ రాష్ట్ర సర్కారుపై వేలెత్తి చూపించే ధైర్యం ఎవ‌రూ చేయ‌ర‌న్న అంచ‌నా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. తెలుగు మ‌హాస‌భ‌ల‌పై మీడియాలో నెగిటివ్ వార్త‌లు రాన‌ప్ప‌టికీ.. స‌భ‌లు నిర్వ‌హిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌హా స‌భ‌ల నిర్వ‌హ‌ణ లోపాలు ఒక ఎత్తు అయితే.. త‌మ ప‌క్క‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన తెలుగు ప్ర‌ముఖుల విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు అనుస‌రించిన వైనంపై తెలంగాణ వ్యాప్తంగా అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

విడిపోయి క‌లిసి ఉందామ‌న్న నినాదంతో తెలంగాణ ఉద్య‌మం సాగిన‌ప్పుడు.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి నాలుగేళ్లు అవుతున్న వేళ‌.. ఎవ‌రికి వారు అన్న భావ‌న‌లో బ‌తికేస్తున్న స‌మ‌యంలో.. మ‌హా స‌భ‌ల్ని ఏర్పాటు చేసి మ‌రీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వారిని అవ‌మానించాలా? అన్న ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రిలో త‌లెత్తుతోంది. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల పేరిట నిర్వ‌హించిన స‌భ‌లు ఏపీ ప్ర‌జ‌ల్ని ప‌ని క‌ట్టుకొని మ‌రీ హ‌ర్ట్ చేయాలా? అన్న ప్ర‌శ్న ప్ర‌తిఒక్క‌రిలో వ్య‌క్త‌మ‌వుతోంది.

కేసీఆర్ స‌ర్కారు అనుస‌రించిన వైనం త‌ప్పంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప‌లువురు మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. ఒక‌వేళ‌.. తెలంగాణ వైభ‌వాన్ని.. తెలంగాణ గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌నుకుంటే తెలంగాణ తెలుగు మ‌హా స‌భ‌ల పేరుతో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి ఉంటే బాగుండేద‌ని.. అందుకు భిన్నంగా ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల పేరుతో భారీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి కేసీఆర్ త‌ప్పు చేశార‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ ప్రాంతంపై ఆంధ్రా పాల‌కులు చేసిన త‌ప్పులు ఎత్తి చూపించే తీరుకు భిన్నంగా ఇప్పుడు కేసీఆర్ చేసిన ప‌నిని ఏపీ ప్ర‌జ‌లు వేలెత్తి చూప‌ట‌మే కాదు.. విడిపోయిన త‌ర్వాత అవ‌మానించేలా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. తెలుగు మ‌హా స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యే ఏపీ ప్రాంతానికి చెందిన వారిని త‌క్కువ‌గా చూస్తున్నామ‌న్న భావ‌న క‌లిగేలా ఏర్పాట్లు చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి నుంచి వ‌సూలు చేసిన తీరులోనే ఏపీ ప్ర‌జ‌ల నుంచి కూడా వ‌సూలు చేయ‌టంపై మొద‌ట్లోనే ప‌లువ‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అయితే.. ఇలాంటి నెగిటివ్ వార్త‌లు మీడియాలో రావ‌టం మంచిది కాద‌న్న భావ‌న‌తో ఏ మీడియాలోనూ వార్త‌లు రాలేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే.. మ‌హా స‌భల నిర్వ‌హ‌ణ విష‌యంలో చోటు చేసుకుంటున్న లోపాల పుణ్య‌మా అని అసంతృప్తి అంత‌కంత‌కూ పెరుగుతోంది. కిట్ల పంపిణీ ద‌గ్గ‌ర నుంచి భోజ‌నాల ఏర్పాటు విష‌యం వ‌రకూ నిర్వ‌హ‌ణ లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తోందంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హెల్ప్ లైన్లు స‌రిగా ప‌ని చేయ‌టం లేద‌ని.. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే తీర్చ‌టానికి ఎవ‌రూ క‌నిపించ‌టం లేద‌న్న మాట ప‌లువురి నోట‌ వినిపిస్తోంది. మొత్తంగా ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు కేసీఆర్ స‌ర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయన్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.