Begin typing your search above and press return to search.

ఆ రూట్ మొత్తాన్ని క్లోజ్ చేయటమే కేసీఆర్ తర్వాతి టార్గెటా?

By:  Tupaki Desk   |   26 Oct 2019 6:12 AM GMT
ఆ రూట్ మొత్తాన్ని క్లోజ్ చేయటమే కేసీఆర్ తర్వాతి టార్గెటా?
X
ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవటం కన్నా.. దాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి.. దేనికదే చెక్ పెట్టటం చాలా సులువు. ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యమ నాయకుడిగా మంచి పేరున్న కేసీఆర్.. తాను నడిచి వచ్చిన దారిని తెలంగాణలో శాశ్వితంగా మూసేసే దిశగా ప్రయత్నాలు షురూ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక ఉద్యమ నాయకుడు.. మరో ఉద్యమాన్ని బయటకు రాకుండా ఉండేలా పీక నొక్కేయటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర సాధన విజయవంతంగా పూర్తి చేసిన వేళ.. అంత పెద్ద సంతోషంలోనూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోకూడదు. తాము ఇంతకాలం ఉద్యమాన్ని నడిపామని.. ఇకపై రాజకీయాల్ని నేర్చుకుంటామని.. తాను నడిపిస్తున్న టీఆర్ఎస్ ను పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తామంటూ ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.

ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తున్నారు కేసీఆర్. ఆంధ్రా ప్రాంతంలోని ప్రజలతో పోలిస్తే.. తెలంగాణ ప్రజల్లో చైతన్యం చాలా ఎక్కువ. దాన్ని పెంచి పోషించే ఉద్యమ సంఘాలతో పాటు వివిధ వర్గాలు ఏర్పాటు చేసుకున్న సంఘాలేవీ తెలంగాణలో చురుగ్గా ఉండకూడదన్నట్లుగా చేయటమే తన లక్ష్యమన్నట్లుగా కేసీఆర్ పని చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం కోసం సమిష్టి పోరాటం చేసిన వేదిక ఉంటే తమ అధికారానికి ఎప్పటికైనా తిప్పలు తప్పవన్న రీతిలో తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే తెలంగాణ పొలిటికల్ జేఏసీని ఎలా మార్చారో తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో సరి సమానంగా ఉన్న కోదండం మాష్టారి ఇమేజ్ ను ఎంత దారునంగా తయారు చేశారో తెలిసిందే.

వ్యక్తుల లక్ష్యంగా ఉన్న స్థానం నుంచి ఇప్పుడు ఆయా సంస్థలే టార్గెట్ గా చేసుకోవాలన్నది కేసీఆర్ తాజా ప్లాన్ గా చెబుతున్నారు. ఇందులో భాగంగానే తన తొలి గురి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల మీద పెడుతున్నట్లు చెబుతున్నారు. సంఘాలు బలంగా ఉంటే ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇబ్బందేనని.. వారిని సమిష్టిగా ఉంచేలా చేసే సంఘాల అడ్రస్ గల్లంతు అయ్యేలా చేయటమే కేసీఆర్ తాజా టార్గెట్ గా చెబుతున్నారు. తెలంగాణలో మరే సంఘం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా.. ఒత్తిడి తెచ్చే పరిస్థితి కూడా ఉండకూడదన్నదే కేసీఆర్ అసలు లక్ష్యమంటున్నారు. మరి.. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందా? అన్నదిప్పుడే తేలేది కాదు. కాలం దీని సంగతి చూస్తుందని చెప్పక తప్పదు.