Begin typing your search above and press return to search.

కేసీఆర్ ‘నమ్మకం’ ఖర్చు జస్ట్ రూ.200కోట్లే

By:  Tupaki Desk   |   1 Jun 2016 7:38 AM GMT
కేసీఆర్ ‘నమ్మకం’ ఖర్చు జస్ట్ రూ.200కోట్లే
X
కడుపు నిండిన మారాజు తనకు నచ్చింది తినాలనుకోవటంలో తప్పు లేదు. సరిగ్గా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లని చోట్ల నమ్మకాల కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టటం ఆసక్తికరమైన అంశమే. నిజానికి ఇది సాహసంతో కూడుకున్న వ్యవహారం కూడా. ఓపక్క ప్రజాసంక్షేమ కార్యక్రమాలు మరోవైపు ఇలాంటి ఖర్చులన్నీ కలిసి చివరకు భారం పడేది సగటు జీవి మీదనే. ఓపక్క ఆర్టీసీ.. విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యమన్నట్లుగా సంకేతాలు ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోవైపు.. తాను అనుకున్నట్లుగా సరికొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు రూ.200 కోట్ల ఖర్చుకు సిద్ధంగా కావటం గమనార్హం.

ఇప్పుడున్న సచివాలయం సౌకర్యవంతంగా లేదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే పైమాట. అయితే.. ఆయన నమ్మే వాస్తుకు తగ్గట్లుగా లేదన్నది లోగుట్టు మాట. మాటల సంగతి ఎలా ఉన్నా.. కేసీఆర్ అనుకున్నట్లు కొత్త సచివాలయాన్ని నిర్మించటానికి అయ్యే ఖర్చు రూ.200 కోట్లు అంటే అదంతా ప్రజాధనమన్న సంగతి మర్చిపోకూడదు.

తన భారీ స్వప్నాన్ని ఊహాచిత్రాలుగా మార్చి ఇప్పటికే విడుదల చేసిన ఆయన అందరి నోటా వావ్ అనిపించేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. ఎవరు ఎలా అనుకున్నా.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేసే పట్టుదల ఉన్న కేసీఆర్.. కొత్త సచివాలయ నిర్మాణాన్ని చకచకా చేపడతారనే చెప్పాలి. ఇక.. కొత్తగా కట్టే సచివాలయానికి సంబంధించిన పనులు ముఖ్యమంత్రి మైండ్ సెట్ కు అనుగుణంగా సాగిపోతున్నాయి.

కేసీఆర్ ఆలోచన ప్రకారం తెలంగాణ నూతన సచివాలయాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాల సచివాలయం ఎంత నిర్మాణ విస్తీర్ణంలో ఉంటుందో అంతే విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయం మొత్తంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెండు హెలికాఫ్టర్లు దిగేలా హెలిప్యాడ్స్ ను సిద్ధం చేయటంతో పాటు.. పక్కా వాస్తుకు అనుగుణంగా నిర్మాణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఢిల్లీలి నార్త్ బ్లాక్.. సౌత్ బ్లాక్ తరహాలోనే కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. నార్త్.. సౌత్ బ్లాక్ లలో వివిధ మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేసి.. మధ్యలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక.. ప్రతి బ్లాక్ కు గరిష్ఠంగా ఆరేడు అంతస్తులకు మించి నిర్మించకూడదని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఏపీ సచివాలయం ఈ నెలాఖరు నాటికి వెళ్లిపోనున్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియ మొత్తంగా పూర్తి అయిన తర్వాత నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

తెలంగాణ సరికొత్త సచివాలయాన్ని నిర్మించటానికి రూ.వంద కోట్లు అవుతుందని అంచనా వేసినా.. అత్యాధునికంగా నిర్మించాలని.. సమస్త ఏర్పాట్లు ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఖర్చు రూ.200 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంచనాల్లోనే ఇంత భారీ మొత్తమైతే.. ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి మరో రూ.50 కోట్లు అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసుకు నచ్చినట్లుగా తెలంగాణ సచివాలయం ఉండటం కోసం ప్రాధమికంగా రూ.200 కోట్లు ఖర్చు కావటం ఏమిటో..? ఈ రోజు కేసీఆర్ చూపించినట్లే.. రేపొద్దున మరో బలమైన నేత అధికారంలోకి వచ్చి తన మనసుకు నచ్చినట్లుగా నిర్మాణం చేయాలంటే..?