Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ల‌కు అడ్డం ప‌డుతున్న పాయింట్ ఇదే

By:  Tupaki Desk   |   3 Nov 2016 1:09 AM GMT
కేసీఆర్ క‌ల‌కు అడ్డం ప‌డుతున్న పాయింట్ ఇదే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల నెర‌వేరేందుకు అనేక అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. కొత్త‌ సచివాలయ నిర్మాణంతో త‌న ప్ర‌త్యేక‌త చాటుకోవాల‌ని భావిస్తున్న సీఎం కేసీఆర్‌కు తాజాగా హైకోర్టు బ్రేక్ లేసింది. తమ అనుమతి లేకుండా ప్రస్తుతమున్న సచివాలయ భవనాలను కూల్చవద్దంటూ హైకోర్టు తాజాగా ఆదేశించిన నేపథ్యంలో సచివాలయ పునర్‌నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లయింది. మరోవైపు ఏపీ సచివాలయ భవనాలను తమకు కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై ఆ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియ మించి చేతులు దులుపుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్తీకమాసంలో సచివాలయ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయం అమలయ్యే అవకాశం కనిపించడం లేదు.

తాజాగా హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో సచివాలయ కార్యాలయాలను మరో ప్రాంతానికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం వాయిదా పడింది. ఈ వారంలో కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్‌, ఆయా హెచ్‌వోడీలకు తరలించాలని ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తుది తీర్పుతోపాటు ఏపీ ప్రభుత్వం నిర్ణయం వెలువడిన తర్వాతే సచివాలయ కార్యాలయాలను తరలించాలని అప్పటిదాకా ప్రస్తుతమున్న ప్రాంతంలోనే కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టిన సమయంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సచివాలయాన్ని కూల్చివేసే ఆలోచన తమకు లేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పది రోజులపాటు వాయిదా వేసే ముందు రామకృష్ణారెడ్డి తన వాదనలు వినిపించారు. కొత్త భవనాలు నిర్మించాలన్న విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, పాత భవనాలను కూల్చివేయాలన్న ఆలోచన కూడా తమకు లేదని కోర్టుకు వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను దాఖలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరగా, కోర్టు వినిపించిన వాదనలనే కౌంటర్‌ రూపంలో దాఖలు చేయాలని చెబుతూ ఈ కేసును పది రోజులపాటు వాయిదా వేసింది.

అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లిన అంశాలను పరిశీలిస్తుంటే ఇప్పట్లో సచివాలయ భవనాలను కూల్చివేసే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని తెలుస్తోంది. నవంబర్‌ 30వ తేదీవరకు కార్తీక మాసం ఉంటుంది. ఈలోపు ఇటు హైకోర్టు గానీ, అటు ఏపీ ప్రభుత్వం గానీ సానుకూల నిర్ణయం ప్రకటిస్తే తప్ప సచివాలయ పునర్‌నిర్మాణ అంశంలో ముందుకుసాగే అవకాశాలు కనిపించడం లేదు. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థలు, నిధులను పంపకం చేయకుండా సచివాలయ భవనాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరితే వాటినిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని ఏపీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్‌ ప్రతిసారి ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకుని రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. సచివాలయ భవనాల అప్పగింతపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించవలసిన అవసరముంది. ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు, జన చైతన్య యాత్రలు ఉధృతంగా జరుగుతున్న ఈ తరుణంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఇప్పట్లో జరిగే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఏపీ ప్రభుత్వం భవనాలకు సంబంధించి నిర్ణయం ప్రకటించకపోవచ్చని తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా హైకోర్టులో సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగి తమకు అనుకూలంగా తీర్పు వెలువరించని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పిటిషనర్లు జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సచివాలయంలో ఉన్న భవనాలు 30 ఏళ్ల క్రితం నిర్మించినవని, ఇప్పట్లో ఈ భవనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, పదేళ్ల క్రితం నిర్మించిన డి బ్లాకును కూల్చివేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. మరో 20 ఏళ్లపాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవనాలను ఉపయోగించుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం భవనాలను కూల్చి ఆ స్థానంలో వందలాది కోట్ల రూపాయలతో కొత్త భవనాలను నిర్మించే ఆవశ్యకత, అవసరం లేదని ఈ నిధులతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవచ్చని చెబుతున్నారు. మొత్తంమీద ప్రభుత్వం చేపట్టిన సచివాలయ నూతన భవనాల నిర్మాణానికి ఇప్పట్లో విజ్ఞాలు ఇప్పట్లో తొలిగే అవకాశం లేనట్టు కనిపిస్తోంది.