Begin typing your search above and press return to search.

మోడీ అడ్డాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం?

By:  Tupaki Desk   |   1 March 2022 5:30 AM GMT
మోడీ అడ్డాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం?
X
కేంద్రం మీద కన్నేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేను తన జట్టులోకి తీసుకున్న ఆయన.. మోడీ సర్కారుపై తన పోరును మరింత తీవ్రతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. కొత్త తరహా ఎత్తుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

ఆడా కాదు ఈడా కాదు.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడ్డా వారణాసిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రత్యర్థులు అంచనాలకు భిన్నంగా స్పందించే కేసీఆర్.. వారణాసికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఇప్పటికే యూపీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానన్న సంకేతాల్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఇచ్చి ఉన్న నేపథ్యంలో ఆయన వారణాసికి వెళ్లి ప్రచారం చేసే అవకాశాల్ని కొట్టి పారేయలేకపోతున్నారు. ఈ నెల ఏడున ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీన ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు కలిసి యూపీ ప్రచారానికి వెళతారన్న మాట వినిపిస్తోంది.

మరి.. ఈ ముఖ్యనేతలతో పాటు సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారానికి వెళతారా? అదేమీ లేకుండా తనకు తానుగా వెళతారా? అన్నది ప్రశ్న. ఇంతకీ.. వారణాసికి వెళితే.. ఏ పార్టీ తరఫున కేసీఆర్ ప్రచారం చేస్తారన్న విషయానికి వస్తే.. సమాజ్ వాదీ పార్టీ తరఫున అని చెబుతున్నారు.

ఏమైనా.. మోడీ అడ్డాకు వెళ్లి మరీ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని చేపడితే మాత్రం మోడీషాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తారని చెప్పక తప్పదు. మొత్తంగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఈసారి దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు అవకాశం ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.