Begin typing your search above and press return to search.

కేసీఆర్ రికార్డు స్థాయి పర్యటనలు

By:  Tupaki Desk   |   28 Nov 2018 10:29 AM GMT
కేసీఆర్ రికార్డు స్థాయి పర్యటనలు
X
పోలింగ్ కు కొద్ది రోజులే సమయం మిగిలి ఉంది. ఈ నాలుగు రోజులు కష్టపడితే చాలు.. ఆ కష్టానికి తగినట్టు ఓట్లు పడితే పంట పండినట్లే.. మరో ఐదేళ్ల పాటు పరిపాలించవచ్చు.. అందుకే పర్యటనలతో నేతలు తెలంగాణలో హోరెత్తిస్తున్నారు. వైరిపక్షాల వీక్ పాయింట్ మీద కొడుతున్నారు.. ప్రజలను ఆకర్షించేలా మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు కేసీఆర్. అన్ని పార్టీల కంటే ధీటుగా ప్రచార పర్వంలోకి దూసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు..

కేసీఆర్ ప్రచార పర్వంలో రికార్డు సృష్టిస్తున్నారు. తెలంగాణ మొత్తం చుట్టేస్తున్నారు. హెలీకాప్టర్ సాయంతో దాదాపు ఒకే రోజులో 10 చోట్ల సభల్లో పాల్గొననున్నారు. పోలింగ్ దగ్గరపడుతున్న వేళ టీఆర్ ఎస్ పార్టీని ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లేందుకు ఆయన పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. కేసీఆర్ సభలు ఏర్పాటు చేస్తున్నారంటే.. ప్రజలు ఆయన స్పీచ్ వినేందుకు కొంత ఆసక్తిగానే ఉంటారు. కేసీఆర్ విస్తృత పర్యటనలతో క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఇప్పుడు క్రమేణా మార్పు వస్తున్నట్లు కనబడుతోంది.

మంగళవారం కేసీఆర్ దాదాపు 9 నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. జరిగిన అభివృద్ధిని, చేపట్టబోయే పనులను వివరిస్తున్నారు. ప్రతిపక్షాలను తూర్పూరా పడుతున్నారు. టీఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. ఓకే రోజు 9 నియోజకవర్గాలంటే.. పార్టీ గెలుపు కోసం ఆయన ఎంతలా కష్టపడుతున్నారో తెలిసిపోతుంది. మరో ఐదు రోజుల్లో 50 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారట. అంటే.. రోజుకు 10 సభల్లో పాల్గొంటారన్నమాట. అన్ని పార్టీల జాతీయ నేతలు ప్రచారం చేస్తున్నా, ఇంత స్థాయిలో తెలంగాణ మొత్తం చుట్టింది ఎవరూ లేదన్నది వాస్తవం.

ప్రతిపక్షాలు కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఆయన చుట్టేస్తున్న పర్యటనలు చూస్తే ప్రతిపక్షం కూడా ఆయన దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మహాకూటమి అంతా సీట్ల సర్దుబాటు, గొడవలు, అలకలు, అసమ్మతితో నిన్నా మొన్నటి నుంచే ప్రచార పర్వంలోకి దిగాయి. కానీ కేసీఆర్ మాత్రం నెలరోజుల నుంచే ప్రజల్లోకి వెళ్లి కష్టపడుతున్నారు. మరి మాటలకే పరిమితమైన కాంగ్రెస్ గెలుస్తుందా.? పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్న కేసీఆర్ కు విజయం వరిస్తుందా.. ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది వేచి చూడాల్సిందే.