Begin typing your search above and press return to search.

ప్రోటోకాల్ వివాదంలో ఇరుక్కున్న కేసీయార్

By:  Tupaki Desk   |   24 Feb 2022 3:30 AM GMT
ప్రోటోకాల్ వివాదంలో ఇరుక్కున్న కేసీయార్
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ప్రోటోకాల్ వివాదంలో ఇరుక్కున్నారు. వరంగల్ మేడారంలో 19వ తేదీన ముగిసిన సమ్మక్క-సారక్క జాతరకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎవరూ కనబడలేదు. ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా ఉండితీరాలి. మంత్రులు లేకపోయినా పెద్ద నష్టం ఏమీలేదు ఎందుకంటే వాళ్ళేమీ అధికారులు కాదు. కానీ గవర్నర్ ప్రోగ్రామ్ లో ఉన్నతాధికారులు కచ్చితంగా ఉండితీరాలి.

జాతర ముగింపు కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యే ముందు వరకు కూడా జాతర ప్రాంతంలోనే ఉన్న మంత్రులు ఒక్కసారిగా మాయమైపోయారు. ఎప్పుడైతే మంత్రులు మాయమైపోయారో వెంటనే జిల్లా ఉన్నతాధికారులు కూడా జారుకున్నారు. దీంతో గవర్నర్ కార్యక్రమానికి హాజరై తర్వాత రాష్ట్రపతి కార్యాలయంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

దీంతో విషయం చాలా సీరియస్ అయిపోయింది. గవర్నర్ కార్యాలయం కేంద్రానికి ఫిర్యాదు చేసిందని తెలియగానే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లో టెన్షన్ మొదలైంది. ఇదే విషయమై వివరణ ఇవ్వాలంటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు చీఫ్ సెక్రటరీ నోటీసులిచ్చారు. దాంతో జిల్లా ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మంత్రులు చెబితేనే జిల్లా ఉన్నతాధికారులు గవర్నర్ ప్రోగ్రామ్ నుండి వెళ్ళిపోయారా ? లేకపోతే తమంతట తామే వెళ్ళిపోయారా అన్నది తేలాలి.

మొన్ననే హైదరాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినపుడు కేసీయార్ స్వాగతం చెప్పని విషయం తెలిసిందే. అప్పుడు కూడా ప్రోటోకాల్ రగడ దుమారం రేపింది. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హాజరవ్వాలని ఏమీలేదు. కాకపోతే అది ప్రధానమంత్రి పదవికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే గౌరవం మాత్రమే. పీఎంగాను సీఎంగాను ఎవరైనా ఉండచ్చు. కానీ పదవులకిచ్చే గౌరవ, మర్యాదలనేవి శాశ్వతంగా ఉంటాయి. మరి తాజా ప్రోటోకాల్ ఉల్లంఘన అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కేసీయార్ మెడకే చుట్టుకునేట్లుంది.