Begin typing your search above and press return to search.

ఢిల్లీ నుంచి వచ్చిన కేసీఆర్ తర్వాతేం చేశారు?

By:  Tupaki Desk   |   10 Sep 2021 3:52 AM GMT
ఢిల్లీ నుంచి వచ్చిన కేసీఆర్ తర్వాతేం చేశారు?
X
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీకి తరచూ వెళుతుండేవారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ సందర్భంగా ఆయన వారాల కొద్ది అక్కడే ఉండేవారు. ఆ సందర్భంలో పలువురిని కలుస్తుండేవారు. సుదీర్ఘ మంతనాలు జరిపేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని పదే పదే ప్రస్తావించేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. కట్ చేస్తే.. ఈ ఏడున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనలకు వెళ్లిందే తక్కువ.

ఒకవేళ వెళ్లినా.. అలా వెళ్లామా? ఇలా వచ్చామా? అన్నట్లుగా ఆయన పర్యటనలు ఉండేవి. ఆ మధ్యలో ఆయన వైద్య చికిత్స కోసం ఢిల్లీలో కొన్ని రోజుల పాటు ఉండిపోయారు. అది మినహాయిస్తే.. మిగిలిన సందర్భాల్లో వెంటనే ఆయన తన పర్యటనను ముగించేవారు. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం.. ఆయన తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలోనే ఉండటం గమనార్హం. గురువారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. శుక్రవారం కానీ వినాయక చవితి కాకుంటే.. ఆయన నగరానికి రావటం కాస్త ఆలస్యమయ్యేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఢిల్లీకి వెళ్లిన ఆయన..ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కు భిన్నంగా తొమ్మిది రోజులు ఢిల్లీలో ఉండిపోవటం.. రోజుకు ఒకరిద్దరు మంత్రుల్ని మాత్రమే కలవటం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు. ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు అమిత్ షా.. గజేంద్ర సింగ్ షెకావత్.. నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి కోవింద్ ను కలవాలని భావించినా.. ఆయన ఢిల్లీలో లేని కారణంగా కలువలేదు. మంత్రుల భేటీల తర్వాత కూడా ఆయన మరోరెండు రోజులు ఢిల్లీలో ఉండటం గమనార్హం.

గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వేళలో హైదరాబాద్ కు బయలుదేరారు. మధ్యాహ్నానికి హైదరాబాద్ కు చేరుకున్నఆయన.. కాసేపటికే నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దామోదర్ రావు ఇంటికి వెళ్లారు. వారం క్రితం దామోదర్ తండ్రి నారాయణరావు మరణించారు.పరామర్శ కోసం వారింటికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మొత్తానికి సిటీకి వచ్చినంతనే పరామర్శ కార్యక్రమానికి తెర తీసిన ఆయన.. గవర్నర్ ను కూడా కలవాలని భావించారు.