Begin typing your search above and press return to search.

కేసీఆర్ అలెర్ట్ నెస్ ఎంత ఎక్కువంటే?

By:  Tupaki Desk   |   12 March 2018 4:24 AM GMT
కేసీఆర్ అలెర్ట్ నెస్ ఎంత ఎక్కువంటే?
X
అన్ని విష‌యాల్ని చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తుంటారు కేసీఆర్. అవ‌స‌రాన్ని బ‌ట్టి కొన్నింటిని ప్ర‌స్తావిస్తూ.. మ‌రికొన్నింటిని కావాల‌నే వ‌దిలేస్తుండ‌టం ఆయ‌న చేస్తుంటారు. పెద్ద స‌మూహంలోనూ.. ముఖ్య‌మైన వ్య‌క్తులు మిస్ అయ్యార‌న్న‌ది ఆయ‌న ఇట్టే గుర్తించేస్తారు. చుట్టూ ఉన్న ప‌రిస్థితుల్ని.. వ్య‌క్తుల్ని ఎంత సూక్ష్మంగా.. సునిశితంగా ప‌రిశీలిస్తార‌న్న విష‌యం తాజాగా మరోసారి రుజువైంది.

ఆదివారం టీఆర్ ఎస్ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం జ‌రిగింది. దీనికి ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. మొత్తంగా ఒక పెద్ద స‌మూహ‌మే ఉంది. అయితే ఈ స‌మావేశానికి చొప్ప‌దండి ఎమ్మెల్యే బోడిగె శోభ గైర్హాజ‌రు అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించి.. ఆమె ఎందుకు రాలేద‌న్న విష‌యాన్ని ఆరా తీయ‌టం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేంతా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ప్ర‌జ‌ల్లోకి ఎంత వెళితే అంత మంచిది జ‌రుగుతుంద‌న్నారు. త్వ‌ర‌లో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టే పెట్టుబ‌డి సాయం ప‌థ‌కం కింద చెక్కులు అంద‌జేసే కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని.. అవ‌స‌రం అనుకున్న చోట పార్టీ ఎంపీలు.. మంత్రులు.. ఇత‌ర నేత‌లు కూడా పాల్గొనలాని చెప్పారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను అంద‌రిని ద‌గ్గ‌రుండి గెలిపించుకొని వ‌స్తాన‌న్న భ‌రోసాను ఇచ్చారు. ఎవ‌రికి వారు ఎమ్మెల్యేలు త‌మ ప‌ని తీరుతో నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌ప‌డాల‌ని చెబుతూ.. ఇద్ద‌రు ఎమ్మెల్యేల పేర్ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. సోలిపేట రామ‌లింగారెడ్డి.. ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డిలు ఇద్ద‌రు త‌మ ప‌నితీరును క‌న‌బ‌రుస్తున్నార‌న్నారు.

ఈ సంద‌ర్భంగా తాను చేయించిన స‌ర్వేల వివ‌రాలు చెబుతూ.. ఈ ఇద్ద‌రికి మంచి మార్కులు వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు. ఇలా బాగా ప‌ని చేసిన ఎమ్మెల్యేల‌తో పాటు.. హాజ‌రు కాని ఎమ్మెల్యే గురించి ప్ర‌స్తావించ‌టం ద్వారా తానెంత అప్ర‌మ‌త్తంగా ఉన్నాన‌న్న విష‌యాన్ని కేసీఆర్ చెప్పేశారు.