Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు లెక్క బారెడు..ఖర్చు మూరెడా?

By:  Tupaki Desk   |   18 March 2016 6:33 AM GMT
కేసీఆర్ సర్కారు లెక్క బారెడు..ఖర్చు మూరెడా?
X
అంకెలు ఘనంగా కనిపిస్తే సరిపోదు.. చెప్పినట్లే ఆ భారీ అంకెల్ని వాస్తవంలో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. కానీ.. తెలంగాణ ప్రభుత్వ విధానం అందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ బడ్జెట్ లో చూపిస్తున్న లెక్కలకు.. వాస్తవంలో చోటు చేసుకుంటున్న దానికి ఏ మాత్రం సంబంధం లేదన్న విషయం కొన్ని గణాంకాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

2014-15 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయిల్ని ప్రభుత్వం కేటాయిస్తే.. అందులో 60 శాతమే ఖర్చు చేయటం గమనార్హం. వివిధ వర్గాల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించినట్లు కనిపించినా ఆచరణలో మాత్రం ఆ నిధుల్ని ఖర్చు చేయకుండా ఉండటం గమనార్హం. కేసీఆర్ సర్కారు గత బడ్జెట్ లో పేర్కొన్న సంక్షేమ నిధుల విషయంలో ఖర్చు చేసిన మొత్తం చూస్తే.. రెండింటి మధ్య అంతరం భారీగా ఉండటం కనిపిస్తుంది.

ఎస్సీలకు బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో కేవలం 34 శాతమే ఖర్చు చేయగా.. ఎస్టీల బడ్జెట్ లో కాస్త మెరుగ్గా 42 శాతం నిధుల్ని ఖర్చు చేశారు. ఇక.. బీసీల విషయానికి సంబంధించి 52శాతం.. మైనార్టీల బడ్జెట్ లో కేవలం 30 శాతం నిధుల్ని మాత్రమే ఖర్చు చేయటం గమనార్హం. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు బడ్జెట్ లో చూపిస్తున్నప్పటికీ.. చెప్పిన విధంగా ఖర్చు చేయకపోతే.. ఆశించినంత సంక్షేమం కూడా జరగటం లేదనే చెప్పాలి. గత పాలకులు పాలనా పరమైన ఎన్నో తప్పిదాలు చేశారని తరచూ విమర్శించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు ఇంత తక్కువగా ఉండటానికి ఏం సమాధానం ఇస్తారో..?