Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే రేసు నుంచి కేసీఆర్ ఎగ్జిట్.. అంతకు మించిన కారణం కోసం అన్వేషణ?

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:32 AM GMT
ఎమ్మెల్యే రేసు నుంచి కేసీఆర్ ఎగ్జిట్.. అంతకు మించిన కారణం కోసం అన్వేషణ?
X
కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ చుట్టూనే తెలంగాణ రాష్ట్ర రాజకీయం తిరగటం తెలిసిందే. మిగిలిన అంశాలు ఎంత కఠినమైనా సరే.. తాను నేర్చుకోవాల్సిన వాటికి సంబంధించిన వివరాల్ని కేసీఆర్ చాలా శ్రద్దతో అధ్యయనం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ రేసులో ఉండకూడదన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి కారణం ఆయన జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టటమే.

జాతీయ ప్రణాళికతో పాటు.. తన రాజకీయ వారసుడికి అధికార బదిలీ చేయాలన్న లక్ష్యమే దీనికి కారణంగా చెబుతున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ పోటీ చేసే చోటు నుంచే తాను పోటీ చేస్తానని.. ఆయన్ను ఓడిస్తానంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ నోటి నుంచి సంచలన చాలెంజ్ లు రావటం తెలిసిందే. ఈటల మాటలతో కాకుండానే.. తనకు తానే గజ్వేల్ నుంచి తాను పోటీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచన కేసీఆర్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఎంపీగా బరిలోకి నిలిచేందుకు సురక్షిత స్థానం మీద కసరత్తు చేపట్టి.. చివరకు మెదక్ ను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే. వచ్చే ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ.. ముందస్తుకు వెళ్లాల్సి వస్తే.. మరో ఆర్నెల్ల వ్యవధిలోనే ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

తాను మెదక్ ఎంపీగా బరిలోకి దిగనున్న వేళ.. ప్రస్తుతం ఆ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని ఈసారి లోక్ సభకు కాకుండా అసెంబ్లీ నుంచి బరిలోకి దింపుతారని చెబుతున్నారు.

జాతీయ రాజకీయాలు.. భవిష్యత్తు మొత్తం ఢిల్లీతో ముడిపడి ఉండేలా కేసీఆర్ ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. కాలం ఆయన అనుకున్నవి అనుకున్నట్లుగా ఎన్నింటిలో సహకరిస్తుందో చూడాలి.