Begin typing your search above and press return to search.

ఏపీలో గెలుపు లెక్క‌ల్ని చెప్పిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   15 May 2019 7:20 AM GMT
ఏపీలో గెలుపు లెక్క‌ల్ని చెప్పిన కేసీఆర్!
X
ఎన్నిక‌ల స‌ర్వే అంచనాల విష‌యంలో ల‌గ‌డ‌పాటికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్లే కేసీఆర్ సైతం తర‌చూ త‌న అంచ‌నాల్ని చెబుతుంటారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ విష‌యంలో త‌ప్పించి ఆయ‌న చెప్పిన అంచ‌నాల‌న్ని క‌రెక్ట్ అయిన ప‌రిస్థితి. తెలంగాణ‌లో అయితే ఆయ‌న చెప్పిన‌వి చెప్పిన‌ట్లుగా జ‌రుగుతాయ‌ని.. ఎన్నిక‌లు ఏదైనా.. ఆయ‌న అంచ‌నాలు మాత్రం మిస్ కావంటారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ చ‌ర్చ‌ల కోసం కేసీఆర్ చెన్నైకి వెళ్ల‌టం.. డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ కావ‌టం తెలిసిందే. అయితే.. కేసీఆర్ గుళ్లు చూసేందుకే త‌మిళ‌నాడుకు వ‌చ్చారే త‌ప్పించి.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ చ‌ర్చ‌ల కోసం కాద‌ని స్టాలిన్ చెప్ప‌టం వేరే విష‌యం అనుకోండి. ఇదిలా ఉంటే.. త‌మ చ‌ర్చ సంద‌ర్భంగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల విష‌యం ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

ఏపీలో ఎవ‌రు గెలుస్తార‌న్న దానిపై కేసీఆర్ స్పందిస్తూ.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకోనుంద‌ని.. ఎంపీ ఎన్నిక‌ల్లో 20 స్థానాల్ని చేజిక్కించుకోనుంద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇది మీ అంచ‌నానా? అన్న స్టాలిన్ ప్ర‌శ్న‌కు కేసీఆర్ బ‌దులిస్తూ.. త‌న ద‌గ్గ‌ర ఉన్న రిపోర్ట‌ల‌ను ఒక్కొక్క‌టిగా వివ‌రించిన‌ట్లు చెబుతున్నారు. కేసీఆర్ చేసిన విశ్లేష‌ణ‌పై కాసింత విస్మ‌యాన్ని స్టాలిన్ వ్య‌క్తం చేసిన‌ట్లుగా స‌మాచారం.

ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ విజ‌యం ఖాయ‌మ‌ని చెప్పిన కేసీఆర్.. ఎన్నిక‌ల వేళ‌లో మాత్రం ఏపీ ఎన్నిక‌ల మీద త‌మ‌కు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేద‌న్న విష‌యం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత మాట్లాడిన కేసీఆర్‌.. బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌టం.. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌టం తెలిసిందే. అయితే.. తాను చేసిన వ్యాఖ్య జ‌గ‌న్ కు న‌ష్టం చేకూరుస్తుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్.. వ్యూహాత్మ‌కంగా ఏపీ ఎన్నిక‌ల మీద మాట్లాడ‌టం మానేశారు. బాబుకు ఇస్తాన‌న్న రిట‌ర్న్ గిఫ్ట్ గురించి ప్ర‌స్తావ‌న తేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.

కీల‌క‌మైన పోలింగ్ కు ముందు రోజు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తానంటే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. అయితే.. పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల మీద మాట్లాడ‌కుండా మౌనంగా ఉన్న కేసీఆర్ తీరుతో చాలామంది టీడీపీ నేత‌లు ఏపీలో త‌మ విజ‌యం ఖాయ‌మ‌న్న అంచ‌నాకు వ‌చ్చారు. ఇదే విష‌యాన్ని ప‌లువురు టీడీపీ నేత‌లు ప్ర‌స్తావించారు కూడా. ఏపీలో జ‌గ‌న్ గెలుస్తుంటే.. కేసీఆర్ ఊరికే ఉండ‌ర‌ని.. ఇప్ప‌టికే ఆ విష‌యాన్ని చెబుతార‌ని.. అలా మాట్లాడ‌లేదంటే క‌చ్ఛితంగా ఏపీలో తాము గెలుస్తున్న‌ట్లు తెలుగు త‌మ్ముళ్లు చెప్పకోవ‌టం క‌నిపించింది.

తాజాగా.. కేసీఆర్ నోరు విప్ప‌ట‌మే కాదు.. జ‌గ‌న్ పార్టీకి వ‌చ్చే సీట్ల‌పై ప‌క్కా లెక్క‌ను చెప్పిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. గాలి బాబుకు వ్య‌తిరేకంగా వీస్తుందా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని చెప్పాలి. మ‌రి.. జ‌గ‌న్ గెలుపు మీద కేసీఆర్ పెట్టుకున్న న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో తేలాలంటే మ‌రో తొమ్మిది రోజులు వెయిట్ చేయాల్సిందే.