Begin typing your search above and press return to search.

రంజిత్ రెడ్డి కి కేసీఆర్ అందుకే టికెట్ ఇచ్చారట!

By:  Tupaki Desk   |   9 April 2019 4:54 AM GMT
రంజిత్ రెడ్డి కి కేసీఆర్ అందుకే టికెట్ ఇచ్చారట!
X
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు దయచేసి ఈ వార్తను చదివే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే.. ఈ వార్తను చదివిన తర్వాత హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అయినా.. చదువుతామంటే మాకు అభ్యంతరం లేదు కానీ.. బాధ పడితే మాకు సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమంలో పని చేసి.. తెలంగాణ కోసం కలలు కని.. తెలంగాణ సాకారం కావాలని కోరుకునే వారందరికి.. ఉద్యమ వేళలో ఎవరు ఎంతగా పని చేశారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మానియా వర్సిటీ మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా తెలంగాణ కోసం ఎంతగా కోట్లాడారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

తెలంగాణ కలను సాకారం చేసుకోవటానికి వారు లాఠీ దెబ్బలు తినేందుకు వెనుకాడలేదు. కేసులకు భయపడలేదు. అంతేనా.. నిండు ప్రాణాల్ని సింఫుల్ గా వదిలేశారు. మా ప్రాణం పోయినా.. కోట్ల మంది తెలంగాణ ప్రజలు సుఖంగా ఉంటారన్న ఆశతో వారు తమ కుటుంబాలకు అన్యాయం చేసి మరీ వెళ్లిపోయారు. మరి.. ఇంతగా త్యాగాలు చేసిన తెలంగాణ ఉద్యమకారుల్లో ఎవరికైనా టీఆర్ ఎస్ తరఫున ఫోటీ చేసే అవకాశం దక్కిందా? అన్న ప్రశ్న వేస్తే.. వచ్చే సమాధానం అందరికి తెలిసిందే.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొందరికి టీఆర్ ఎస్ ప్రభుత్వం పదవులు లభించిన మాట వాస్తవం. దాన్ని కాదనలేం. కానీ.. వారి సంఖ్య ఎంత అంటే.. 0.1 శాతం కంటే తక్కువగా చెప్పాలి. తెలంగాణ కోసం అహరహం కష్టపడిన వారికి.. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవటానికి తపించిన వారెంతోమంది ఈ రోజుకు హ్యాపీగా ఉన్నది లేదు. ఎందుకంటే.. తెలంగాణ పాలకుల నిర్ణయాల కారణంగా చెప్పాలి.

ఈ దరిద్రపుగొట్టు రాజకీయాల్ని మొత్తంగా మార్చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఉద్యమవేళలో తాను అనుసరించిన విధానాలకు భిన్నంగా తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్లు ఇచ్చిన వారిలో ఎక్కువమంది వ్యాపారులు.. పారిశ్రామికవేత్తలు.. డబ్బులున్న వాళ్లు మాత్రమే. కేసీఆర్ పార్టీ.. టికెట్లు ఎవరికి ఇచ్చుకుంటారన్నది ఆయన ఇష్టం. గెలిపిస్తామా? లేదా? అన్నది మాత్రమే ప్రజల చేతుల్లో ఉందన్న మాటను కాదనలేం. కానీ.. కోట్లాదిమంది ఉద్యమకారుల్ని వదిలేసి.. రంజిత్ రెడ్డి లాంటి వ్యాపారవేత్తను తెలంగాణ ఉద్యమకారుడిగా కీర్తించటమే హర్ట్ చేసేలా చేస్తుంది.

తాజాగా చేవెళ్ల ఎంపీగా టీఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గురించి కేసీఆర్ చెప్పిన మాటలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. తెలంగాణ సాధించుకున్నది ఇలాంటి వాటిని వినేందుకా? అన్న భావన కలగటం ఖాయం. డబ్బులున్న పెద్ద మనిషి.. ఢిల్లీకి వెళతా.. ఎంపీ అవుతానని చెప్పగానే.. కేసీఆర్ ఓకే అనేసినట్లుగా ఆయనే చెప్పారు. డబ్బులన్నోళ్లు కోరింది కోరుకున్నట్లు చేసే కేసీఆర్.. శ్రీకాంతాచారి తల్లి లాంటి వారిని అందలం ఎందుకు ఎక్కించరు? అన్నది ప్రశ్న. ఇంతకీ.. రంజిత్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చామన్న విషయాన్ని కేసీఆర్ మాటల్లోనే వింటే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.

‘‘రంజిత్‌ రెడ్డి ఉద్యమకారుడు. 2001 నుంచే టీఆర్ ఎస్‌ పార్టీకి అండదండగా ఉన్నారు. ఆయన ఎన్నడూ ఏ పదవి అడగలేదు. ఈసారి పార్లమెంటుకు పోతానని అన్నారు. నాకు చాలా పౌల్ట్రీ లు ఉన్నాయని - చేవెళ్లతో ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆయన విద్యావంతుడు. చాలా డబ్బు ఉంది. ఆయనే పది మందికి బువ్వ పెట్టే స్థితిలో ఉన్నడు. చేవెళ్లకు బ్రహ్మాండంగా ఉపయోగపడతారు. ఆయనను గెలిపించండి’’ అని కేసీఆర్ కోరారు. వ్యాపారాలు.. బాగా డబ్బులు ఉన్నోళ్లు ఎంపీలుగా మారి ఢిల్లీకి వెళితే.. తమ వ్యాపారాలు మరింత చక్కగా చేసుకుంటారు కానీ.. ప్రజల్ని.. ప్రజా సమస్యల్ని పట్టించుకుంటారా? పారిశ్రామికవేత్తలకు.. వ్యాపారవేత్తలకు ఏపీ పార్టీలు టికెట్లు ఇచ్చి.. ఏపీ రాజకీయాల్ని ఎంత కంపు చేశాయో చూసిన తర్వాత.. వారి దారిలో కేసీఆర్ నడవటమా?