Begin typing your search above and press return to search.

సారు మాటలు విన్నంతనే ఫ్లాష్ బ్యాక్ కళ్ల ముందు కదలాడిందే

By:  Tupaki Desk   |   6 Oct 2022 4:34 AM GMT
సారు మాటలు విన్నంతనే ఫ్లాష్ బ్యాక్ కళ్ల ముందు కదలాడిందే
X
అదే మనిషి అయినప్పుడు అవే మాటలు వినిపిస్తాయి. పార్టీ పేరు మారినంత మాత్రాన మాటలు మారిపోవు కదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా ఉన్న ఆయన.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అధినేతగా మారిన వైనం తెలిసిందే. పార్టీ పేరును మార్చేస్తూ నిర్ణయం తీసుకున్న అనంతరం.. పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ మాటల్ని చూస్తే.. కళ్ల ముందు ఫ్లాష్ బ్యాక్ కనిపించిందని చెప్పాలి.

దేశానికి తెలంగాణ మోడల్ అమలు కావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. తమ తొలి టార్గెట్ కర్ణాటక..మహారాష్ట్రగా చెప్పుకొచ్చారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తో కలిసి భారత రాష్ట్ర సమితి జెండా ఎగరనుందన్న ధీమాను కేసీఆర్ వ్యక్తం చేశారు.

ఎప్పటిలానే ఆయన ప్రాధాన్యతల్లో రైతులు.. మహిళలు.. వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడిన ఆయన.. తన పార్టీ పేరును మార్చిన అంశంపై జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు.

దేశ ప్రజల సమస్యల్ని తీర్చటమే తమ అజెండా పెట్టినట్లుగా ఆయన చెప్పుకున్నారు. తనకు ప్రధానమంత్రి పదవి మీద ఆసక్తి లేదన్న ఆయన మాటల్నివిన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్ మాటలు కళ్ల ముందు కదలాడటం ఖాయం. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ నోటి నుంచి ఈ తరహా మాటలే వినిపించాయి. ఆయన ఎప్పుడూ కూడా తన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తప్పించి.. ముఖ్యమంత్రి కుర్చీ కాదన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయినంతనే తానే ముఖ్యమంత్రి కావటం తెలిసిందే.

ఇప్పుడు అదే తరహాలో కేసీఆర్ మాటలు ఉన్నాయి. దేశ రూపురేఖల్ని మార్చటమే తప్పించి.. తనకు ప్రధానమంత్రి పదవి మీద ఆశ లేదని చెప్పటం గమనార్హం.

తనకు అలవాటైన మాటల్ని చెబుతున్న కేసీఆర్ తీరు చూస్తే.. ఆయన తన పాత మాటల్నే కొత్తగా చెప్పారని చెప్పక తప్పదు. దేశాన్ని మార్చాలన్నదే లక్ష్యమైనప్పుడు.. ప్రధాన మంత్రి పదవి కోసం కాకుండా మరే లక్ష్యంతో ఆయన జాతీయ పార్టీ పెట్టారన్న దానికి సూటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.