Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ముహుర్తం అస్సలు బాగోలేదా? ఏమిటీ ఎదురుదెబ్బలు?

By:  Tupaki Desk   |   11 Jan 2023 10:41 AM GMT
బీఆర్ఎస్ ముహుర్తం అస్సలు బాగోలేదా? ఏమిటీ ఎదురుదెబ్బలు?
X
సాఫీగా సాగిపోతూ.. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొంటూ దూసుకెళ్లే పరిస్థితికి భిన్నంగా.. నిత్యం ఏదో ఒక పంచాయితీ.. మరేదో ఇష్యూ.. అనుకోని పరిణామం.. ఊహించని ఎదురుదెబ్బ.. ఇలా కాలం సాగితే పరిస్థితి ఎలా ఉంటుంది? నమ్మకాలు..జాతకాలు.. ముహుర్తాల్ని ఎక్కువగా నమ్మే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటీవల కాలంలో ఎదురవుతున్న సవాళ్లు.. సమస్యలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎప్పుడు ఎదురుకాలేదని చెప్పాలి.

తన ఉనికి పరిమితంగా ఉన్న వేళలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ సమయంలో తాను బలపడుతున్న వేళ.. తనకంటే ఎన్నో రెట్లు బలమైన పాలకులు ఉన్నప్పటికీ వారిని ఎప్పటికప్పుడు ఆత్మరక్షణలో పడేసేలా చేస్తూ.. వారు తన సంగతి తేల్చే వరకు విషయాన్ని రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్న కేసీఆర్.. ఇటీవల కాలంలో మాత్రం సై అంటే సై అన్నట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలన్న నిర్ణయాన్ని తీసుకున్న నాటి నుంచి పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుమార్తె పేరు బయటకు రావటం ఒక కీలక పరిణామంగా చెప్పక తప్పదు. ఉద్యమ సమయంలో వచ్చిన ఆరోపణలు బయటకు వినిపించకుండా చేసే విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన నైపుణ్యం.. గడిచిన నాలుగైదు నెలలుగా మాత్రం చేయలేకపోతున్నారని చెప్పాలి. దీనికి తోడు.. కేసీఆర్ నోటి నుంచి తరచూ వినిపించే గీత దాటొద్దన్న మాటను తానే బ్రేక్ చేసి.. గీతలు.. హద్దుల్ని దాటేస్తున్న తీరుతో మోడీషాలు మరింత కటువుగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

తమను సవాలు చేసేందుకు ఎవరూ సిద్ధం కాని వేళలో.. వారందరికి భిన్నంగా కేసీఆర్ తీరు ఉండటం మోడీషాలకు మంట పుట్టటంతో పాటు.. తమతో స్నేహాన్ని నటించి.. తమను దెబ్బ తీయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే.. తమ సత్తా చాటాలన్న నిర్ణయానికి రావటంతో పాటు.. తెలంగాణలో అధికారం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ మధ్యన జరిగిన బదిలీల్లో కేసీఆర్ సర్కారుకు తమ వంతు సాయం చేసే వారిపైన ఫోకస్ చేసిన కేంద్రం.. కేసీఆర్ తనకు బలమని నమ్మే వారిని తాజాగా టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు.

టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారిన క్రమంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెప్పక తప్పదు. నిజానికి అప్పటి నుంచే కేసీఆర్ కు కష్టాలు.. ఎదురుదెబ్బలు మొదలైనట్లుగా చెబుతున్నారు. గడిచిన మూడు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఐటీ.. ఈడీ దాడులకు సంబంధించిన ఫలితాలు మరికొద్ది రోజుల్లో బయటకు వస్తాయని.. అప్పటి నుంచి రాజకీయం మరింతగా మారుతుందంటున్నారు.

ఇప్పటివరకు ట్రైలర్ మాత్రమే చూపించిన మోడీషాలు తర్వలోనే తమ సినిమాను షురూ చేస్తారని చెబుతున్నారు. తాజాగా సీఎస్ సోమేశ్ విషయంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బే తగిలిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2017లో మొదలైన వ్యవహారం ఇప్పుడే ఎందుకిలా జరిగినట్లు? అన్న ప్రశ్నను సంధించేవారు లేకపోలేదు. అందులో వాస్తవం ఎంతన్న విషయాన్ని పక్కన పెడితే.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత నుంచే గులాబీ బాస్ కు టైం ఏ మాత్రం సెట్ కావటం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపించటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.బీఆర్ఎస్ ముహుర్తం అస్సలు బాగోలేదా? ఏమిటీ ఎదురుదెబ్బలు?