Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు త‌ల‌నొప్పి తెస్తున్న ఆ పొర‌పాటు

By:  Tupaki Desk   |   14 Jun 2017 6:48 AM GMT
కేసీఆర్ కు త‌ల‌నొప్పి తెస్తున్న ఆ పొర‌పాటు
X
టీఆరెస్ ప్రధాన నాయకులంతా ఒక్కరొక్కరుగా భూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ - ఎంపీ కేకే మియాపూర్ భూముల గొడవల్లో పీకల్లోతు ఆరోపణలు ఎదుర్కొంటుండగా తాజాగా మరో నేతకీ అదే పరిస్థితి ఎదురైంది.

సీనియర్ నేత - రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై భూ కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదల కోసం ఇచ్చిన అసైన్డ్ భూమిని అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కాగా వీరంతా కాంగ్రెస్ లో ఒకప్పుడు కీలక నేతలుగా ఉండి అనంతరం టీఆరెస్ లోకి వచ్చి మంచి ప్రాధాన్యం పొందుతున్నవారే. తెలంగాణలో పాలక టీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ వారిని పిలిచి పీఠాలపై కూర్చోబెడితే ఇప్పుడు వారి కారణంగా టీఆరెస్ పీఠమే కదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

స్వరాష్ర్టం ఏర్పడి తొలి ప్రభుత్వాన్ని టీఆరెస్ ఏర్పరిచి మూడేళ్లు కాగా.. తొలి మూడేళ్లలో పలు ఇబ్బందులు, ఆరోపణలు ఎదురైనా టీఆరెస్ సమర్థంగా ఎదుర్కొంది. కానీ... ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతల కారణంగా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. భూకుంభకోణాలు స్పష్టంగా తెలుస్తుండడంతో ప్రభుత్వం వారిని వెనుకేసుకుని రాలేని పరిస్థితుల్లో ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ల కారణంగా టీఆరెస్ ప్రభుత్వం ఇమేజికి భారీగా గండి పడుతోంది.

డీఎస్ రిజిస్ర్టేషన్ చేయించుకున్న భూమి మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామ పరిధిలో గౌడవెల్లి-రాయిలాపూర్ రోడ్డులో ఉంది. సర్వే నంబర్ 221లో ఉన్న సుమారు 9 ఎకరాల ఈ భూమి ఇప్పుడు వివాదంగా మారింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ భూమిని నిరుపేద ముదిరాజ్ లకు కేటాయించారు. 1972-73లో ఈ భూమిని ముదిరాజ్ ల నుంచి బొక్క యాదిరెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత యాదిరెడ్డి కుమారులు సాయిరెడ్డి, బల్వంత్ రెడ్డి, రఘుపతి రెడ్డిల నుంచి ఈ భూమిని 2015 డీఎస్, ఆయన అనుచరుడు ఎ.వి.సత్యనారాయణలు కొనుగోలు చేశారు. ఇందులో డీఎస్ పేరిట 4 ఎకరాలు ఉంది. ఈ భూమిని 2015లో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఏడాది జనవరిలో మ్యుటేషన్ కోసం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వీరు దరఖాస్తు చేసుకున్నారు. భూమిపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఇది రాజకీయావర్గాల్లో చర్చనీయాంశం అయింది. కాగా కాంగ్రెస్ సీనియర్లను చేర్చుకుని తలనొప్పులు తెచ్చుకున్నామని పలువురు టీఆరెస్ నేతలే అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/